ఏటూరునాగారం, జనవరి 27 : మేడారానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నందున గద్దెల వద్ద వెంటనే లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, పెయింటింగ్ పనుల్లో వేగం పెంచాలని ఈవో రాజేందర్‌ను ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. జాతర పనులపై సంబంధిత శాఖ అధికారులతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులకు సంబంధించి టెండర్లు తెరిచి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్గత రోడ్లు, పార్కింగ్ స్థలాల్లో లైటింగ్‌పై సమీక్షించారు. పూజారి షెడ్లు, ఊరట్టం, మేడారంలోని ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతులపై ఆరా తీశారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాల నుంచి మ్యూజియం వరకు పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి 5లోగా ప్రత్యేక మరమ్మతులు పూర్తి చేయాలని, మోడల్ పార్కింగ్ స్థలాల కోసం పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. మ్యూజియం పెయింటింగ్ పనులు, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ, పొనుగొండ్ల, గుంజేడు దేవాలయాల్లో పెయింటింగ్ పనులు ఏ మేరకు పూర్తి చేశారో తెలుసుకున్నారు. సివిల్ పనులు, ఎడ్ల బండి బాటల పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ ఈఈ హేమలతను ఆదేశించారు.
సులభ్ కాంప్లెక్స్‌లు, దుస్తులు మార్చుకునే గదులను స్వాధీనం చేసుకుని వాటి వినియోగం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు తొలగించేందుకు రెవెన్యూ, పోలీసుల సహాయం తీసుకోవాలని డీపీవో వెంకయ్యకు సూచించారు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, తాగునీటిని ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేయాలని డ్రెస్ చేంజింగ్ కాంపార్టుమెంట్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ఈఈ నారాయణను ఆదేశించారు. అవసరమైన చోట డీటీఆర్లు ఏర్పాటు చేయాలని గట్టమ్మ, తాడ్వాయి, చిన్నబోయినపల్లిలో బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ నాగేశ్వర్రావును ఆదేశించారు. సమావేశంలో ఏపీవో వసంతరావు, ఎస్వో రాజ్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
తాడ్వాయి, మేడారం గ్రామాల్లో జరుగుతున్న ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మేడారం, తాడ్వాయి గ్రామాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. ముందుగా మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో చేపడుతున్న మరమ్మతులను పరిశీలించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్లను ఆదేశించారు. జంపన్నవాగు వద్ద దుస్తులు మార్చుకునే శాశ్వత గదులను పరిశీలించి, నిర్వహణను జీపీకి అప్పగించాలని ఇంజినీర్లకు సూచించారు. గిరిజన మ్యూజియం భవన పెయింటింగ్ పనిని పరిశీలించి ఆదివాసీ సంస్కృతిలో పెయింటింగ్ ఉండాలని, మ్యూజియం కాంపౌండ్ వాల్ పనులను వారంలో పూర్తి చేయాలని చిత్రకారులకు సూచించారు.
ఆర్టీసీ బస్టాండ్‌లోని సులభ్ కాంప్లెక్స్‌లను పరిశీలించి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీకి అప్పగించాలన్నారు. తాడ్వాయిలోని టాయిలెట్ బ్లాక్‌లు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ స్థితిని పరిశీలించి పనులను నేటి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదారి నుంచి కిచెన్ , డైనింగ్ హాల్‌కు మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ ఇంజినీర్‌కు సూచించారు. పీవో వెంట ఏపీవో వంతసరావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం రాజ్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చందర్, అసిస్టెంట్ ఇంజినీర్ దేవిశ్రీ, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీరాములు ఉన్నారు.
వన దేవతలకు విరాళం
వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ప్రాంతం అభివృద్ధి కోసం ఓ భక్తుడు రూ. 1,00,800 విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన రాడికో లిక్కర్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఈ చంద్రారెడ్డి శనివారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల కోసం సంబంధిత చెక్కును దేవాదాయ శాఖ సిబ్బంది జగదీశ్వర్, మధుకర్‌కు అందజేశారు.