ఆత్మకూరు/హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : పరకాలలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయాయి. కొండా వర్గీయులు, ఇనుగాల వర్గీయులు పరస్పరం దుర్భాషలాడుకున్నారు. బాహాబాహీకి దిగి నినాదాలు చేశారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని జీఎస్సార్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రామిరెడ్డి తమ తమ వర్గీయులతో కలిసి స్టేజీపైకి నినాదాలు చేసుకుంటూ వచ్చారు. నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా అర్ధగంట సేపు నినాదాలు చేసుకొంటూ తోపులాడుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేజీపై ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రవీంద్ర ఉత్తమ్‌రావు దళ్విముందే కార్యకర్తలు బహాబాహీకి దిగారు. కొండా మురళి ఇది నా అడ్డ అంటూ మీసం తిప్పగా, ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇది నా అడ్డ అంటూ తొడ కొట్టాడు. ఈ గ్రూపు తగదాలతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది.
అలాగే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తోంది. కాంగ్రెస్ గ్రూపుల పార్టీ అని మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఇద్దరూ పశ్చిమ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకరికొకరు పోటీపడి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం కొత్త రాగం అందుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్ బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య పోటీ నెలకొంది. టికెట్ నాదంటే నాది.. అంటూ ఎవరికి వారే అనుచరుల దగ్గర చెప్పుకుంటుండగా తాజాగా బీసీలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌లో కొత్త నినాదం బయటకు వచ్చింది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రేపల్లె శ్రీనాథ్, యువజన కాంగ్రెస్ నాయకుడు రేపల్లె రంగనాథ్ వారికి వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి ఎనిమిదిసార్లు బీసీలే గెలుపొందారని తెలిపారు.
ఎవరికి వారే యమునా తీరు..
కాంగ్రెస్ అంటేనే గ్రూప్‌ల పార్టీ.. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా ఉంది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితులు.. అసలే అంతంత మాత్రం బలం ఉన్న కాంగ్రెస్‌లో ఇప్పుడు గ్రూప్ రాజకీయం ఆ పార్టీ శ్రేణులను నిరాశపరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా వరంగల్ పశ్చిమలో వార్ నడుస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య ఎప్పటి నుంచో వర్గ విభేదాలు నడుస్తుంటే ఆమెను వరంగల్ తూర్పు అధ్యక్షురాలిగా పంపించగా, ఇప్పుడు నాయిని రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా జంగా రాఘవరెడ్డి పోటీలోకి దిగాడు. అధిష్ఠానం సైతం తమకే టికెట్ ఇస్తుందని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా బీసీలతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు.