పర్వతగిరి : పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో గోపనపల్లి గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి ఎస్సై భోగం ప్రవీణ్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీలలో 90 జిలెటిన్ స్టిక్స్, 39 డిటోనేటర్లు లభ్యమైనట్లు వెల్లడించారు. పేలుడు పదార్థాలతోపాటు కంప్రెసర్ ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
ట్రాక్టర్ యజమాని పవన్ కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ చెప్పారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.