బచ్చన్నపేట ఆగస్టు 20 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండ నాగారం గ్రామం నుంచి దేవాదుల కాలువ పైపులైన్ మరమ్మతుకు నిధులు మంజూరు అయినట్లు ఇరిగేషన్ ఈఈ మంగీలాల్ తెలిపారు. అందులో భాగంగానే బండ నాగారం గ్రామం కాలువ నుంచి కొడవటూరు గ్రామంలోని ఊర చెరువులోకి గోదావరి జలాలు తరలించేందుకు గాను కాల్వ మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.10. 35 లక్షలు మంజూరు చేసిందన్నారు.
కాల్వ మరమ్మతు చేయించేందుకు గాను సర్వే చేపట్టి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కాల్వ పనులు పూర్తయితే ఊర చెరువులోకి గోదావరి జలాలు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. కొడవటూరు చెరువుతోపాటు బచ్చన్నపేట తాళ్లచెరువు, చింతలకుంట, గుడి చెరువు నిండే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రావణ్, ఏఈ వెంకన్న, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, నీల శ్రీనివాస్, మిలానాపురం కనకయ్య, వంగపల్లి శేఖర్ రెడ్డి, కరికె కరుణాకర్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.