హనుమకొండ, ఫిబ్రవరి 26 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్మడి జిల్లా పరిధిలో 11,189 మంది టీచర్లు ఓటర్లు ఉండగా 76 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా జంబో బాక్సులు వినియోగిస్తున్నామని, వీటిని ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఆయా జిల్లాలో నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 19మంది బరిలో ఉండగా కేవలం ఆరుగురు అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉందనే ప్రచారం సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 19 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును ఓటర్లు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 27న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 ఓటర్లు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో పురుషులు 6,886 మంది, మహిళలు 4,469 మంది ఉన్నారు. కాగా అత్యధికంగా హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఓటర్లు ఉన్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు సైతం ఈ జిల్లాలో ప్రచారం జోరుగా చేసినట్లు తెలుస్తున్నది. హనుమకొండ జిల్లాలో 5,215 మంది, వరంగల్‌లో 2352 మంది, మహబూబాబాద్‌లో 1,663 మంది, జనగామలో 1,002 మంది, ములుగులో 628 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 329 మంది ఓటర్లు ఉన్నారు.
అలాగే పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలో విస్తరించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటర్లు 2,483 మంది, జిల్లాలో జరుగునున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 83 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. అలాగే హనుమకొండ జిల్లాలోని కమలాపుర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 166 మంది, పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 4,585 మంది ఉన్నారు. వీరంతా నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నేడు ఓటింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరుగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ కొనసాగనున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లకు గాను 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్ జిల్లాలో 6, ములుగు జిల్లా లో 3 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రా ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పలుమార్లు అధికారులతో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఒక ఓటు.. ఐదుగురు సిబ్బంది
జయశంకర్ జిల్లా పలిమెలలో పోలింగ్ బూత్ ఏర్పాటు
పలిమెల, ఫిబ్రవరి 26 : మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రులు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పలిమెల మండలంలో మొదటి సారి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఓటర్లు 38 మంది ఉండగా.. టీచర్ ఎమ్మెల్సీకి ఒక ఓటరు మాత్రమే ఉన్నారు. ఒక ఓటరుకు బూత్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐదుగురు సిబ్బందితో పాటు పోలీస్‌లను నియమించారు.
Dd