హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 23: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ను ప్రతి ఒక్క క్రీడాకారుడు స్ఫూర్తిగా తీసుకోవాలని హనుమకొండ యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్ అన్నారు. శనివారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. భారతదేశానికి ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఒలింపిక్స్‌లో హాకీ క్రీడలో వరుసగా మూడు పతకాలు రావడానికి ముఖ్యభూమిక పోషించారని, అందుకే ఆయన జయంతిని భారతదేశం మొత్తం క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జేఎన్ఎస్ స్టేడియంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 10 సంవత్సరాలోపు పిల్లలకు రన్నింగ్ పోటీలు, మ్యూజికల్ చైర్, బేబీ క్రౌలింగ్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆదివారం ఉదయం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అశోక్‌కుమార్ తెలిపారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.