కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అంచనా తప్పింది. ఓ సిటీ ప్లాట్ల వేలంతో నిధులు మూటగట్టుకోవాలనుకున్న అత్యాశకు చెక్ పడింది. 13వ విడత ప్లాట్ల వేలంపై కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో బొక్కబోర్లా పడింది. 12 విడతల్లో భారీగా ఆదాయం సమకూర్చుకున్న కుడా.. ఈ దఫా అదే లెక్కతో ముందుకెళ్లింది. హనుమకొండ, వరంగల్ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా అధిక ధరలు నిర్ణయించి ఈ నెల 5న ప్లాట్ల వేలానికి పూనుకుంది. అయితే కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిరాశకు గురైంది. చేసేదేమీలేక అధికారులు వేలాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్లాట్ల వేలానికి ముందు అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టడం.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడమే ప్రజల అనాసక్తికి కారణంగా తేలింది. గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అభివృద్ధి చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేక పోయింది. కాలనీలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడం, కొత్త చైర్మన్ సందర్శించకపోవడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఫలితంగా భారీగా నిధులు రాబట్టుకోవాలనుకున్న కుడా అంచనా తారుమారైంది. – వరంగల్, జనవరి 7
రెండు దశాబ్ధాల క్రితం అజాంజాహి మిల్లుకు సంబంధించి 120 ఎకరాల భూమిని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ నుంచి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కొనుగోలు చేసింది. వరంగల్ నగరంలో గేటెడ్ కమ్యూనిటీ కాలనీ ఏర్పాటు చేస్తామని విస్తృత ప్రచారం కల్పించడంతో అధిక ధరలున్నా ఓ సిటీలోని ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 12 విడతల్లోనూ ఇలాగే ప్రచారం చేసి ప్లాట్లు విక్రయించిన కుడా భారీగా నిధులు సమకూర్చుకుంది. ఈ నెల 5న ఓ సిటీ ప్రాంగణంలో 13వ విడత వేలం పాటల్లో 40 రెసిడెన్స్ ప్లాట్లకు వేలం నిర్వహించేందుకు నిర్ణయించింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా నార్త్ ఈస్ట్ ప్లాట్లకు గజానికి రూ.75 వేలు, మిగతా వాటికి రూ. 70 వేలు, రోడ్డు వైపున్న కమర్షియల్ ప్లాట్లకు రూ. లక్ష ధర నిర్ణయించడంతో కొనుగోలుదారులకు గుండె ఆగినంత పనైంది. దీంతో వేలం పాటలు మొదలైనా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. మధ్యాహ్నం వరకు కేవలం 11 మంది మాత్రమే టోకెన్లు తీసుకోవడంతో అధికారులు వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మాట నిలుపుకోని కుడా
గేటెడ్ కమ్యూనిటీ కాలనీగా ఓ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పిన కుడా అధికారులు మాట నిలుపుకోలేక పోయారు. చుట్టూ ప్రహరీ నిర్మించి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామన్న హామీని విస్మరించారు. వేలం సందర్భంగా అప్పటి ఎస్పీని తీసుకొచ్చి ఓ సిటీలో పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయిస్తామని చెప్పించారు. దీంతో వరంగల్ నగరంలో తొలి గేటెడ్ కమ్యూనిటీ కాలనీగా మారుతుందన్న ఆశతో అనేక మంది ప్లాట్లు కొనుగోలు చేసి రూ. కోట్లతో ఇళ్లు నిర్మించుకున్నారు. ప్లాట్లు విక్రయాలతో వందల కోట్లు సంపాదించుకున్న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విమర్శలను మీదేసుకుంది.
సమస్యల తిష్ట
గేటెడ్ కమ్యూనిటీగా చెప్పుకుంటున్న ఓ సిటీలో సమస్యలు తిష్ట వేశాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా కుడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడ నివాసం ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు. చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రాత్రి సమయం లో ఆ ప్రాంతం మందు బాబులకు అడ్డాగా మారుతున్నది. యథేచ్ఛగా పందులు, కుక్కలు తిరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ అస్త్యవస్థంగా మారిందని, ఇందులో సగం కూడా పని చేయడం లేదని అంటున్నారు. సెంట్రల్ లైటింగ్ పనిచేయకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల కుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఓ సిటీ వైపు కన్నెతి చూడలేదని, సమస్యలపై దృష్టి పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుడా ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించిన ఓ సిటీ అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.