దేవరుప్పుల, అక్టోబర్ 25: రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. దేవరుప్పల మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులకు అనేక మాయమాటలు చెప్పి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి వారిని పట్టించుకోవడం లేదన్నారు. పండిన ప్రతి గింజా కొంటామని చెప్పిన ప్రభుత్వం సన్నబియ్యం ఎప్పుడు కొంటుందో, ఆ ధాన్యానికి బోనస్ ఎప్పుడిస్తుందో తెలపాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇప్పటికే రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువకు అమ్ముకుంటుండగా, నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని ప్రభుత్వంపై వారు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని, మరో ఐదువేలు పెంచి రూ. 15 వేలు ఇస్తామన్న రేవంత్రెడ్డి ఉన్న రైతుబంధును ఎగ్గొట్టి వారిని నట్టేట ముంచాడన్నారు. పదేళ్లలో ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించిన రైతులు ఈ ప్రభుత్వం పుణ్యమా అని పది నెలల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారని దయాకర్రావు అన్నారు. గోరంత చేసి, కొండంత ప్రకటనలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని పేర్కొన్నారు.
రుణమాఫీ కాక, రైతుబంధూ లేక, సాగు నీరందక, 24 గంటల కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి కొనుగోలు సెంటర్లో సన్నబియ్యం కొనాలని, మండలంలో ఒకటి రెండు సన్నబియ్యం కొనుగోలు కేంద్రాలు పెడతామని అధికారులు అంటున్నారని, దీనిలోని పరమార్థమేమిటని ప్రశ్నించారు. ఇకనైనా రైతులకు న్యాయం చేయని పక్షంలో రైతుల పక్షాన ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ చేపట్టి ప్రభుత్వాన్ని అడుగుడుగునా నిలదీస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.