వరంగల్ చౌరస్తా, మే 16 : కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలోని ఎమర్జెన్సీ విభాగం అలంకార ప్రాయంగా మిగిలింది. ఆధునిక యంత్ర పరికరాలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అత్యవసర సేవలు అందని పరిస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు ఈ దవాఖానను కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ఏర్పాటు చేశారు.
కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర పది రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నా అత్యవసర విభాగాన్ని మాత్రం ప్రారంభించడం లేదు. అత్యాధునిక యంత్ర పరికరాలున్నప్పటికీ సేవల పరంగా ఎంజీఎం ఆస్పత్రే పెద్ద దిక్కుగా నిలుస్తున్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎంజీఎం దవాఖానాకే తీసుకెళ్తున్నారు. వీరిని వెంటనే తరలించేందుకు రవాణా వ్యవస్థ సైతం అందుబాటులో లేదు.
అంబులెన్స్ కూడా ఎంజీఎం నుంచి రావాల్సిందే. ఆస్పత్రి అవసరాలకు అనుగుణంగా వాహనాలు లేకపోవడంతో చాలా మంది రోజులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న ముగ్గురు డ్రైవర్ల సేవలను కూడా ఎంజీఎం దవాఖానలోనే వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, వైద్యాధికారులు స్పందించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగాన్ని ప్రారంభించడంతో పాటు అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.