గీసుగొండ, ఫిబ్రవరి 26 : వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ (పియాగో) ఆటో బ్యాటరీ పేలి కాలి బూడిదైంది. బాధితుడు, ఆటో యజమాని బోగి శివకుమార్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. 11 నెలల క్రితం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటోను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో డౌన్ పేమెంట్ కింద రూ. 40 వేలు చెల్లించి, మిగతా రూ 4.68 లక్షలకు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఆటో నడపగా వచ్చిన ఆదాయంతో నెలనెలా ఈఏంఐలు కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకుమార్ ఆటోకు చార్జింగ్ పెట్టి ఇంట్లో పడుకోగా, 10.50 గంటల ప్రాంతంలో ఇంటి పక్కనున్న వ్యక్తి ఫోన్ చేసి ఆటోలో మంటలు వస్తున్నాయని చెప్పాడు. దీంతో బయటకు వచ్చి చూసే సరికే ఆటో మంటల్లో కాలిపోతున్నది. చుట్టుపక్కల వారి సహాయంతో మంటలను ఆర్పగా అప్పటికే ఆటోలో ఉన్న సీట్లు, టాప్, వైర్లు, డెక్కు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఆటో నడిస్తేనే తన కుటుంబం గడుస్తుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై గీసుగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.