పెద్దవంగర, డిసెంబర్13 : రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామా లు ఏకగ్రీవమైతే మాకు రెమ్యునరేషన్ ఇవ్వరా? అని ఎన్నికల సిబ్బంది ఆర్డర్ కాపీలతో శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఉన్నతాధికారులతో పీవోలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల విధి నిర్వహణకు ఆర్డర్ కాపీలను అందించడంతో ఇక్కడకు వచ్చామన్నారు. తమకు కేటాయించిన గ్రామాలు ఏకగ్రీవం కావడంతో విధులు వద్దని చెప్పి వెళ్లిపోవాలంటున్నారని పేర్కొన్నారు.
వెంటనే రెమ్యునరేషన్, డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, లేదంటే తమకు ఎన్నికల విధులు అప్పగించాలని అధికారులను డిమాండ్ చేశారు. అవి తామిచ్చిన ఆర్డర్ కాపీలు కావని, ఇచ్చిన వారినే అడగమంటున్నారని, తమతో గొడవ పెట్టుకుంటారా.. అంటూ అధికారులు అనడం సరైంది కాదన్నారు. దీనిపై పోరాటం చేయడానికి సిద్ధమని మండిపడ్డారు. ఎన్నికల విధి నిర్వహణలో రిజర్వ్ పీవోలను ఉంచడమే కాక ఏపీవోలను సైతం అలాగే ఉంచి తమను మాత్రమే వెళ్లి పోవాలనడం సరైంది కాదన్నారు. ఎన్నికల సిబ్బంది ప్రభాకర్‌రావు, వెంకటకరుణాకర్రెడ్డి, లక్ష్మి, లక్ష్మయ్య, తదితరులున్నారు.
ఎంపీడీవోతో సిబ్బంది వాగ్వాదం
ములుగు, (నమస్తేతెలంగాణ) : రెమ్యునరేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన వెంకటాపూర్ ఎంపీడీవో రాజుతో ఎన్నికల రిజర్వ్డ్ సిబ్బంది శనివారం గొడవ పడ్డారు. 2వ విడత ఎన్నికల్లో భాగంగా శనివారం వెంకటాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రంలో అరకొర వసతుల కారణంగా మహిళా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజర్వులో ఉన్న సిబ్బందిని సెంటర్‌కు రావాలని పదే పదే ఫోన్లు చేసి పిలిపించి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎంపీడీవో దురుసుగా ప్రవర్తించి తిరిగి వెళ్లమని ఆదేశించారని పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు రమేశ్ తెలిపారు. ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని కోరారు.