ములుగు, మార్చి 11(నమస్తే తెలంగాణ)/తాడ్వాయి : ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్పానికి తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం ఆదర్శంగా నిలువాలని దేశానికే రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న కొండపర్తిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ములుగు కలెక్టర్ టి.ఎస్. దివాకరతో కలిసి గవర్నర్ పర్యటించారు. తొలుత కొమురంభీమ్, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించి బొడ్రాయి వద్ద పూజ లు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రారంభించి ఆధునీకరించిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం రూ.7,84,700 వ్యయంతో నిర్మించిన మసాలా పౌడర్ యూనిట్‌ను, రూ.7,76,594 తో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ యూనిట్‌ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం రిమోర్టు సహాయంతో ఇంది ర జలపభ్ర మోటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ చిన్న గ్రామమైన కొండపర్తి అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలన్నారు. స్వయం ఉపాధి యూనిట్లతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని గుజరాత్లో అమూల్ పాల ఉత్పత్తుల కేంద్రం తరహాలో కొండపర్తిలో నెలకొల్పిన మసాలా యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆయన ఆకాక్షించారు. కొండపర్తితో రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని, అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతికి తాను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివాసీలు కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలి: మంత్రి సీతక్క
గవర్నర్ దత్తత తీసుకోవడంతో కొండపర్తి అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని, మహిళల ఆర్థికాభివృద్ధిలో గ్రామాన్ని మోడల్‌గా నిలువాలని మంత్రి సీతక్క అన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు గవర్నర్ ఏడు బోరు బావులు మంజూరు చేశారని, ఫలితంగా రెండు పంటలు పండే అవకాశం ఉన్నదని తెలిపారు. బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసుకుంటూ యూనిట్లలో తయారు అవుతున్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఆదివాసీ గ్రామాల ప్రజలు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నదన్నారు. దాన కిషోర్ మాట్లాడుతూ మిర్చి, పసుపు, మసాలా యూనిట్‌కు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
గిరిజనుల అభ్యున్నతికి పాటుపడే సంస్థలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రూ.కోటీ 50లక్షలతో కొండపర్తిలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అనంతరం వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను గవర్నర్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేడారం జాతర జరిగే తీరును అడిగి తెలుసుకొని భక్తులకు అనువైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానని గవర్నర్ చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్‌కిషన్ జాదవ్, గవర్నర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, గవర్నర్ ఏడీసీ మేజర్ అమన్కుండు, సీఎస్ఓ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చుపటేల్ పాల్గొన్నారు.