ఖిలావరంగల్: కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల పైడి అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్కు కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంట భూములను చదును చేసి విత్తనాలను విత్తుటకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం విత్తన వ్యాపారులు కల్తీ చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ప్రధానంగా వరంగల్, నర్సంపేట పట్టణ లను కేంద్రంగా చేసుకొని దళారులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ అధికారులు కూడా సరైన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కల్తీ విత్తనాలు అరికట్టాలని, బ్లాక్లో అమ్మే విత్తన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బొర్ర ఆనంద్, జిల్లా నాయకులు , భైరబోయిన ఐలయ్య, శివరాత్రి కుమారస్వామి, గంట శంకరన్న, తల్లి సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.