మహబూబాద్ రూరల్ : భారీ వర్షాలకు తెగిన చెరువుకు వెంటనే మరమ్మతు చేయించాలని అయోధ్య గ్రామ మాజీ సర్పంచ్ దుండి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అయోధ్య గ్రామ చెరువు వద్ద స్థానిక రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుండి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడు నెలలు క్రితం భారీ వర్షాల నేపథ్యంలో తెగిన చెరువులకు అధికారులు ఇంతవరకు మరమ్మతులు చేయించలేదని విమర్శించారు.
గతంలో అనేక మార్లు ఇరిగేషన్ అధికారులకు చెరువు సమస్యను గురించి వివరించామని అయినా గాని అధికారులు చెరువు దగ్గరికి వచ్చి పర్యవేక్షణ చేయలేదని పేర్కొన్నారు. వర్షం పడితే చెరువులో చుక్కనీరు కూడా నిలిచే పరిస్థితి లేదని, దీంతో పంటలు పండించటానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువుకు మరమ్మతులు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకన్న, మల్లయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.