తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర పాలకుల కుట్రలు, అప్పటి కాంగ్రెస్ సర్కారు పూటకోమాటతో సృష్టించిన గందరగోళం కారణంగా మలిదశ ఉద్యమంలో ఎందరో యువతీయువకులు ఆందోళనతో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తమ చావుతోనైనా ప్రత్యేక రాష్ట్రం రావాలన్న కాంక్షతో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, పలువురు అమరుల కుటుంబసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలిచిన తీరును ‘నమస్తే’తో పంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అమరులు వీణవంక శ్రీనివాసాచారి, పెండెల రాజయ్య, చుక్క రంజిత్, సంగ కవిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నీతానై తమకు అండగా నిలిచారని, రూ.పదిలక్షల చొప్పున ఆర్థిక సాయం, ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. – జయశంకర్ భూపాలపల్లి, జూన్ 21 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జరిగిన మలిదశ ఉద్యమంలో వీణవంక శ్రీనివాసాచారి, పెండెల రాజయ్య, చుక్క రంజిత్, సంగ కవితతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో నలుగురు ఆత్మబలిదానం చేసుకున్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. తెలంగాణ ఏర్పడే నాటికి కడు బీదరికంలో మగ్గుతున్న ఆయా కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలవడంతో వారి జీవనం ఎంతో మెరుగుపడింది. తెలంగాణ వచ్చాకే రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతున్నదని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని, ఈ ప్రగతినే అమరులు కోరుకున్నారని, పలువురు అమరులు కుటుంబసభ్యులు తెలిపారు. పెద్ద మనసుతో తమ మా కుటుంబాలను ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జూన్ 21 (నమస్తే తెలంగాణ)
‘మా అమ్మానాన్న ఈశ్వరమ్మ-సర్వేశ్వరాచారి. మేము ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్న కుమారస్వామి, రెండో అన్న శ్రీనివాసాచారి. నేను మూడో వాడిని. రెండో అన్న శ్రీనివాసాచారి భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిండు. అప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమకారుడు కేతిరెడ్డి వాసుదేవారెడ్డితో కలిసి చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయనేవాడు. తెలంగాణ రాకుండా ఆంధ్రోళ్లు అడ్డు పడుతున్నారని ఆవేదన చెందేవాడు. డిగ్రీ అయ్యాక గొర్లవీడులోనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ పురోహితం కూడా చేసి మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. తెలంగాణ కోసం ఎక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు జరిగినా అక్కడికి వెళ్లి ముందుండి పాల్గొనేవాడు. ఇంత ఉద్యమం చేస్తున్నా తెలంగాణ వచ్చే అవకాశం లేదని, ఆంధ్రోళ్లు రాష్ట్రం ఇవ్వకుండా అడ్డు పడుతున్నారనే మనస్తాపంతో 2012, ఆగస్టు 27న ఊరిలోనే పురుగుల మందు తాగి ఆత్మ బలిదానం చేసుకున్నడు. మా అన్న చనిపోయాడన్న బెంగతో మా నాన్న సర్వేశ్వరాచారి కూడా చనిపోయాడు. అప్పటికి మా కుటుంబానికి అప్పులున్నాయి. జీవనం గడవడమే కష్టమయ్యేది. ప్రత్యేక తెలంగాణ కోసం మా అన్న శ్రీనివాసాచారి చేసిన ఆత్మబలిదానాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ సారు మా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన నాకు రెవెన్యూ శాఖలో వీఆర్వోగా ఉద్యోగం ఇచ్చారు. రూ.10 లక్షలతో బాకీలు తీర్చినం, శిథిలావస్థలో ఉన్న మా ఇంటిని బాగు చేసుకున్నాం. నేను ఇప్పుడు కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటంం. మా పెద్దన్న కుమారస్వామి భూపాలపల్లిలోనే గ్యాస్ వెల్డింగ్ షాపు నడుపున్నడు. మా అమ్మకు వితంతు పింఛన్ వస్తున్నది.
– వీణవంక సంపూర్ణాచారి, జూనియర్ అసిస్టెంట్, గొర్లవీడు, జయశంకర్ జిల్లా (అమరుడు శ్రీనివాసాచారి తమ్ముడు)
నా కొడుకు శ్రీనివాసాచారి తెలంగాణ కోసం కొట్లాడిండు. అప్పటి కుట్రలతోని తెలంగాణ వస్తదో రాదోనని రందివెట్టుకున్నడు. ఓరోజు పురుగుల మందు తాగి సచ్చిపోయిండు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు నా పెద్ద కొడుకు లెక్క ఆదుకున్నడు. మాకు పది లక్షల రూపాయలిచ్చిండు. ఆ పైసలతోటి బాకీలు కట్టి ఇల్లు మంచిగ చేసుకున్నం. నా మూడో కొడుకు సంపూర్ణాచారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మేము ఇబ్బంది లేకుంట బతుకుతున్నం. కేసీఆర్ సారు మేలు మరువం.
– వీణవంక ఈశ్వరమ్మ (శ్రీనివాసాచారి తల్లి)
మాది రేగొండ మండలం దుంపిల్లపల్లి. మా అమ్మానాన్నలు భద్రయ్య-ప్రమీల. మేము ముగ్గురం అన్నదమ్ములం రంజిత్, మహేశ్, నరేందర్. మా అన్న రంజిత్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడ జరిగినా వెళ్లి ఉద్యమానికి తనవంతు ఊపిరిలూదేవాడు. నిరంతరం తెలంగాణ సాధన కోసమే తపించేవాడు. ఈ క్రమంలోనే నాటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపం చెంది 2013 జనవరిలో హన్మకొండలోనే పురుగుల మందు తాగి ఆత్మబలిదానం చేసుకున్నాడు. తెలంగాణ రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, తెలంగాణకు రావాల్సిన హక్కులు రాకుండాపోతున్నాయి అని ఆవేదనతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తినడానికే ఇబ్బంది పడ్డ మా కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ సారు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసి, నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన నాకు హన్మకొండలో ఎన్సీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. సంక్షేమ పథకాలు మంచిగ అమలవుతున్నయ్. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న ఫలాలను చూసి మా అన్న రంజిత్ ఆత్మకు శాంతి కలుగుతుంది. మా అన్న బలిదానం చేసుకున్న విషయాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ సారు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించి, మా కుటుంబంలో నాకు ఉద్యోగం ఇచ్చి ఎంతో ఉపకారం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి ఆదుకున్నారు. నాకు ఉద్యోగం రావడం వల్లే నా కుటుంబాన్ని సంతోషంగా పోషిస్తున్న. తెలంగాణ అమరుల కుటుంబాలకు మరింత మేలు చేస్తారని సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది. 2016 జూన్ 25న హన్మకొండలో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణ చేతుల మీదుగా ఉద్యోగ ఉత్తర్వులు అందుకున్న. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో మా అన్న పేరిట వ్యవసాయ భూమి కొన్నం. మా తమ్ముడు నరేందర్ బిజినెస్ చేసుకుంటున్నడు. ఇప్పుడు మా కుటుంబం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మేలు మరువం.
– చుక్క మహేశ్, జూనియర్ అసిస్టెంట్, దుంపిల్లపల్లి, జయశంకర్ జిల్లా (అమరుడు చుక్క రంజిత్ సోదరుడు)
మాది రేగొండ మండలం భాగిర్తిపేట. నా భర్త రాజయ్య ప్రత్యేక తెలంగాణ కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి ఎక్కడ సభలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగినా ఎళ్లేటోడు. తెలంగాణ వత్తెనే నేను పాణంతో ఉంటా, లేకుంటే ఉండడని అనేటోడు. ఇంత కొట్లాడుతున్నా తెలంగాణ వత్తలేదని రంది పెట్టుకొని ఆంధ్రోళ్లు చేయవట్టే తెలంగాణ వత్తలేదని అనేటోడు. ఆ మనాదితోనే 2010, జనవరి 3న పురుగుల మందు తాగి సచ్చిపోయిండు. అప్పటికే నాకు ఒక బిడ్డ. మా కుటుంబం బాగా పేదరికంలో ఉండేది. కూలినాలి చేసి బతికేటోళ్లం. నాలుగు లక్షల రూపాయల బాకీ ఉండె. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు మమ్ములను కన్న బిడ్డలెక్క దగ్గరికి తీసిండు. 10 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసిండు. నాకు రేగొండ సర్కారు బడిలో అటెండర్‌గా సర్కారు నౌకరీ ఇచ్చిండు. కేసీఆర్ సారు ఇచ్చిన 10 లక్షల రూపాయల్లో నాలుగు లక్షలు బాకీ తేర్పిన. మిగతా పైసలు నా పేరుమీద, నా బిడ్డ జ్యోతి పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. కేసీఆర్ సారు దయవల్ల నేను ఇప్పుడు ఉద్యోగం చేసుకుంట వచ్చిన జీతంతో మంచిగ బతుకుతున్న. నా బిడ్డ జ్యోతిని హన్మకొండలోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదివిత్తున్నా. కేసీఆర్ సారు వల్లనే మా కుటుంబం నిలబడింది. లేకుంటే ఇంకా పేదరికంలో ఉండేవాళ్లం. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– పెండెల లలిత, భాగిర్తిపేట, జయశంకర్ జిల్లా (అమరుడు పెండెల రాజయ్య భార్య)
మా చెల్లె సంగ కవిత మొట్లపల్లి సర్కారు బడిలో పదో తరగతి చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంల పాల్గొన్నది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు జరిగినప్పుడు పరుగుపరుగున వెళ్లేది. తెలంగాణ మనాదితోనే పొద్దంతా ఆలోచించేది. తెలంగాణ వస్తలేదనే బెంగతో 2010 జనవరి 10న కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మ బలిదానం చేసుకున్నది. మా కుటుంబాన్ని సీఎం కేసీఆర్ సార్ ఆదుకున్నడు. రూ.10 లక్షల ఆర్తిక సాయం చేసిండు. నాకు ఉద్యోగం ఇచ్చిండు. నేను మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి సర్కారు బడిలో అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్)గా పని చేస్తున్న. సీఎం కేసీఆర్ సారు మా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచి సాయం చేసిండు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటం. సర్కారు ఇచ్చిన డబ్బుతోని కొన్ని బాకీలు కట్టుకున్నం. మిగతా డబ్బును ఇల్లు కట్టుకునేందుకు వాడుకున్నం. ఇప్పుడు నాకు వచ్చే జీతం డబ్బుతో నా కుటుంబాన్ని మంచిగ సాదుకుంటున్న. మా చెల్లె కవిత ఆత్మబలిదానాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సారు మా కుటుంబానికి చేసిన మేలును ఎప్పటికీ మరువం.
– సంగ సమ్మయ్య, మొట్లపల్లి, జయశంకర్ జిల్లా (అమరురాలు సంగ కవిత సోదరుడు)