చిట్యాల, మార్చి 21 : చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్లో తాగునీటి కొరత తీవ్రమైంది. గ్రామ ప్రజల రోజూవారీ అవసరాల కోసం గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి సక్రమంగా సరఫరా చేయడంతో ఇన్నాళ్లు సాఫీగా నీరందాయి. కానీ ప్రస్తుతం ట్యాంకులో నీరు నిండుగా ఉన్నప్పటికీ అధికారుల పట్టింపులేమితో గ్రామంలో కొన్ని ఇళ్లకు మాత్రమే నీరందుతున్నది. ఈ విషయమై పలుమార్లు గ్రామస్తులు సంబంధిత అధికారుల ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక వ్యవసాయ బోరు బావులు, పత్తి మిల్లు నుంచి ఎడ్లబండ్ల మీద నీళ్లు తెచ్చుకుంటున్నారు.
మిషన్ భగీరథ అధికారులకు, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పరిషరించడం లేదు. శాంతినగర్లో లీకేజీ, గేటు వాల్ సమస్య, ఎత్తు, వంపులు అంటూ కారణాలు చెబుతూ దాటేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు శాంతినగర్లో నీటి సమస్య రాకుండా శాశ్వత పరిషారం చూపాలి. లేకపోతే అవే ఎడ్లబండ్లతో, బిందెలతో రోడ్డు మీద నిరసనలు తెలుపుతాం..
– అన్న రాజు, శాంతినగర్, చిట్యాల మండలం
పెద్దవంగర : పడమటితండాలో తాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తండా కు చాలా రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక అల్లాడుతున్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు అంతకంతకూ పడిపోయి తండాలోని బోర్ల నుంచి కొద్దిపాటి నీళ్లు కూడా రావడం లేదు. దీంతో కొంద రు వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇండ్ల వద్ద వచ్చే అరకొర నీటి కోసం గొడవ పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండాకు మిషన్ భగీరథ నీటిని అందిం చి తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.