ఆసియాలో అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఆదాయం బాగానే వస్తున్నా మౌలిక వసతులు కరువయ్యాయి. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.43.39 కోట్ల ఆదాయం వచ్చినా రైతులను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మార్కెట్లో నిఘా కొరవడడంతో యార్డుల్లో పంట ఉత్పత్తుల చోరీ జరుగుతున్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోగా, కొత్తవి అమర్చడంతో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనబరుస్తున్నది. కనీసం తాగునీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మార్కెట్లో సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
– వరంగల్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ)
ఎనుమాముల మార్కెట్లో మిర్చి, పత్తి యార్డుల్లో పంట ఉత్పత్తుల చోరీ జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు నిరసిస్తున్నారు. గతంలో మార్కెట్ ప్రధాన గేటు, కార్యాలయంతో పాటు మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఎక్కువగా పనిచేయడం లేదు. వాటి స్థానంలో, యార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఇటీవల మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మార్కెట్ ఆవరణలో 252 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించినా ఆచరణలోకి రాలేదు.
పరిశుభ్రతపై కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిశుభ్రత కోసం క్లీనింగ్ మిషన్లు సమకూర్చాలని పలుమార్లు చాంబర్, రైతు సంఘాల ప్రతినిధులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను కోరినా ఇప్పటికీ ప్రభుత్వం వాటిని సమకూర్చలేదు. వీటిని అందుబాటులోకి తెస్తే మార్కెట్ యార్డులు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
మార్కెట్ నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. యార్డుల్లో కనీసం రైతులకు తాగునీటి వసతి కల్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక మహిళా రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. రైతుల విశ్రాంతి భవనం నిర్వహణ కూడా అటకెక్కింది. బెడ్స్ పాడై ఉండగా తాగునీటి వంటి వసతి లేదు. కొన్ని సందర్భాల్లో రైతులు బెడ్స్‌పై పడుకోలేక విశ్రాంతి భవనంలోని గదుల్లో నేలపై పడుకుంటున్నట్లు తెలిసింది.
యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాలపై రైతుల పంట ఉత్పత్తులను తూకం వేయడంలో ఇంటర్నెట్ సమస్య వెంటాడుతోంది. వైఫై మెరుగుపరచాలనే ప్రతిపాదన కూడా అమల్లోకి తేలేదు. మార్కెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం 109 రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయగా ప్రస్తుతం సెక్రటరీ సహా 31 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో మార్కెటింగ్ శాఖ ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను తీసుకుని మార్కెట్‌ను నిర్వహిస్తున్నది. అభివృద్ధి కోసం మార్కెట్ ఆవరణలో చేపట్టిన నిర్మాణ పనులూ అసంపూర్తిగా నిలిచిపోయాయి. సమస్యలపై మార్కెట్ కార్యదర్శి నిర్మలను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.