ఐటీడీఏకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల సమస్యల నిలయంగా మారింది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మరుగు దొడ్లతో కాలకృత్యాలకు అడవి బాట పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ మూలన పడడంతో తప్పని పరిస్థితుల్లో బోర్ వాటర్‌ను తాగుతున్నారు. స్నానం చేసేందుకు కనీసం ఫ్లోరింగ్ కూడా సరిగా లేక కష్టాలు పడుతున్నా రు. వెంటనే ఐటీడీఏ అధికారులు స్పందించి గురుకులంలో వసతులు కల్పించాలని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
– ఏటూరునాగారం, అక్టోబర్ 23
పేరుకే ఆశ్రమ పాఠశాల అయినప్పటికీ సమస్యలతో చదువులు సాగిస్తున్నారు. సుమారు 400 మందికిపైగా విద్యార్థులకు మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ఆరు బయట అడవిలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. టాయిలెట్స్, మరుగుదొడ్ల బ్లాక్ ఒక్కటి ఉంది. ఇందులో 12 మరుగుదొడ్లు ఉండగా ఒక్క దానికి మాత్రమే డోర్ ఉండగా, నీటి సరఫరా లేకపోవడం తో వినియోగించడం లేదు. తెల్లవారుజామునే అడవిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. కనీసం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సమస్యలు తీర్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.
ఆర్వో ప్లాంట్ మోటరు చెడిపోవడంతో మూలన పడింది. మోటరు బోరు వాటర్‌ను తాగుతుండగా, చిలుముతో కూడిన నీళ్లు వస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. స్నానాలు చేసే ప్రాంతంలో కనీసం ఫ్లోరింగ్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ప్లాట్ ఫాం దగ్గరకు వెళ్లేందుక పక్కనే విద్యుత్ వైర్లు ఉన్నాయి. అవి అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడు షాక్ కొడుతాయో తెలియకుండా ఉంది. పాఠశాల ఆవరణలో ఉన్న భవానికి విద్యుత్ సరఫ రా కూడా సక్రమంగా లేదు. దీంతో ఫ్యాన్లు, ట్యూబులైట్లు కాలిపోతున్నాయి. కింద బ్లాక్‌కు తాత్కాలికంగా కరెంట్ సరఫరా చేయగా పైన ఉన్న బ్లాక్‌లకు విద్యుత్ వెలుగులు లేవు. ఉపా ధ్యాయుల నివాస గృహాల్లో సైతం సరైన సౌకర్యాలు లేకుండా ఉన్నాయి.
నాలుగు నెలల క్రితం చేపట్టిన స్వాగత తోరణం పనులు కూడా నిలిపివేశారు. స్టీమ్ కుకింగ్ పరికరాలు మసి పట్టి పనికి రాకుండా పోయాయి. జాతీయ రహదారి పక్కనే ఐటీడీఏకు అత్యంత సమీపంలో ఉన్న ఈ పాఠశాల దయనీయ స్థితిలో ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గిరిజనుల అభివృద్ధి ఏమో కానీ గిరిజన పిల్లలు చదివే పాఠశాలు అధ్వానంగా ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. పాఠశాలకు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో లోవోల్టేజీ సమస్య వేధిస్తోంది. ఎన్నో సమస్యలతో విద్యార్థులు చదువుకునేందుకు కష్టాలు పడుతున్నారు. చివరకు ఉపాధ్యాయులు కూడా ఏమీచేయలేని పరిస్థితి ఉంది. వెంటనే ఐటీడీఏ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.