జహీరాబాద్, మే 5 : పంట మార్పిడి తప్పని సరి చేస్తేనే వ్యవసాయంలో అధిక లాభం పొందవచ్చునని బసంతపూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితో అనేక లాభాలతో పాటు చీడపురుగులు నివారణ సులువుగా ఉంటుందన్నారు.
మే నెలలో పొలాలకు దుక్కులు చేసి చెరువు మట్టిని వేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు.
రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. పచ్చి రొట్ట ఎరువులు, జీలుగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించి సన్న, చిన్నకారు రైతులకు అదాయం పొందే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కంది వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. చరిత్కుమార్ మాట్లాడుతూ నీరు వృథాగా పోకుండా పంట సాగులో మొక్కకు కావాల్సిన నీటి బొట్టుగా వేరు దగ్గర డ్రిప్, స్ప్రింక్లర్ ద్వారా నీటి అందిస్తే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చెట్లతోనే యావత్ మానవ మనుగడ అధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కంది వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ఫ్రొపెసర్ డా. పద్మ, టీచింగ్ అసోసియేట్ ఈఆర్ అని ల్‌కుమార్, మండల వ్యవసాయాధికారి అవినాశ్ వర్మ పాల్గొన్నారు.