హనుమకొండ, జూన్ 10 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింద్నారు. దీంతో రాష్ర్టంలోని ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం కాకుండా రూ.15వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి ఆటో సంక్షేమ బోర్డుగాని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకంలో ఆటో కార్మికులకు 10 శాతం ఇళ్లు కేటాయించాలని శేషు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకులు నూతన కంటి ఆనందం, ఎర్ర బొజ్జు రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.