హనుమకొండ, అక్టోబర్ 13: వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ నమ్మించి గొంతు కోసిందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మండిపడ్డారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునే మమ్మల్ని రేవంత్‌రెడ్డి మోసం చేశారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కనీసం ఏ విధమైన శాస్త్రీయ డేటా లేకుండా 2011 గాలి లెక్కలు పట్టుకుని, అంత సడన్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనేనా వర్గీకరణ పేరుతో వాటాలు, సామాజిక న్యాయం? మిగతా వాటికి అక్కర్లేదా? రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? అని ప్రశ్నించారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్‌గా పంజాబ్, హర్యానాలో మొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మోడీ. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వలన వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోరం అన్నారు.
చెంచాగిరికి అలవాటుపడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారేతప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. రేవంత్‌రెడ్డిని తొలిగించి భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయాలని, అలాగే ఒక్కో సంవత్సరం అన్ని వర్గాలకు చెందినవారిని సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కామ ప్రభాకర్‌రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాల శౌరి, మిరియాల చిన్నప్ప, దండు కుమార్, తోట దుర్గాప్రసాద్, కనికెళ్లనాని, నెల్లి సూరిబాబు పాల్గొన్నారు.