హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28 : రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 93వ జయంతి, స్వరార్చన కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 25వ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతి భా పురసారాన్ని మిమిక్రీ శ్రీనివాస్‌కు అందజేశారు. అంతకుముందు నేరెళ్ల శిష్యులు, ప్రముఖ మిమిక్రీ కళాకారుల ధ్వన్యనుకరణ మంత్రముగ్ధులను చేసింది.
ఈ సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరేళ్ల శోభావేణుమాధవ్ మాట్లాడుతూ.. ఏ మనిషి పుట్టుకతో తనకు తానుగా నేర్చుకోలేడని, మనం అలవాటు చేసుకోవాలన్నారు. తల నుంచి వేలు వరకు పూర్తిగా కళాహృదయం ఉన్నవాడు వేణుమాధవ్ అని గుర్తుచేశారు. ప్రతి ఒకరిలో ఉన్న కళ బయటికి తీసుకొచ్చేందుకు నేరెళ్ల వేణుమాధవ్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యదర్శి డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.. వేణుమాధవ్ కళా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
వేణుమాధవ్ తర్వాత ఇంతటి కళను ప్రపంచానికి చాటి చెప్పింది మిమిక్రీ శ్రీనివాస్ అని, అత్యంత ఉన్నత స్థానానికి మిమిక్రీ కళను తీసుకెళ్లారని అన్నారు. అతడికి ఈ పురసారం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ రాజు, ప్రఖ్యాత కళాకారుడు మైమ్ మధు, ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, సినీనటుడు లోహిత్కుమార్, మిమిక్రీ ఆర్టిస్టు జనార్దన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవీ మధన్మోహన్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ సభ్యులు నేరెళ్ల శోభావతి, నేరేళ్ల శ్రీనాథ్, నేరెళ్ల రాధాకృష్ణ, సలహా మండలి సభ్యులు డాక్టర్ గిరిజామనోహర్ బాబు, వనం లక్ష్మీకాంతారావు, కొణతం కృష్ణ, రామచంద్రమౌళి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, నేరెళ్ల వేణుమాధవ్ శిష్యులు, ప్రముఖ మిమిక్రీ కళాకారుల ధ్వన్యనుకరణ అందరినీ ముగ్ధులను చేసింది.