హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5: విద్యారంగంలో సమాజం ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండా ప్రకాశ్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో బోధనకే పరిమితం కాకుండా విద్యార్థులకు మెంటర్‌గా ఉండి ప్రోత్సహించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తేవాలన్నారు.
రాజ్యాంగపరమైన పదవీలో తనలాంటి వారు నిలబడటానికి తమకు విద్యాబుద్ధులు నేర్పి, వారి విజ్ఞానాన్ని పంచిన గురువులే కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటుకు తాను కృషి చేస్తానన్నారు. శాసనమండలిలో ఒకరోజంతా విద్యారంగంపై చర్చపెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ఈ చర్చల్లో ముఖ్యమంత్రి 4 గంటలసేపు పాల్గొన్నారన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థపై ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఉత్తమ టీచర్లు, ఆర్డినరీ టీచర్లంటూ ఉండరని అందరూ ఉత్తమ ఉపాధ్యాయులేనన్నారు. హనుమకొండ జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తాను సంకల్పం తీసుకున్నాన న్నారు. విద్యతోనే జీవితంలో మార్పు వస్తుందని, ఈ విషయంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేమన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాగుంటేనే దేశం బాగుపడుతుందన్నారు.
సామాజిక సమానత్వం గురించి విద్యార్థులకు టీచర్లకు ఎక్కువగా బోధించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐఈవో ఏ.గోపాల్, హనుమకొండ ఎంఈవో నెహ్రూనాయక్‌తో పాటు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.