ఖిలావరంగల్: డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దోమన్ చిన్న రావు ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని కళామంచ్ ఆడిటోరియంలో 2025 జాతీయ అవార్డులను ప్రకటించారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 30 మందికి గౌరవ డాక్టరేట్లు, 20 మందికి జాతీయ అవార్డులను అందజేసింది. ఇందులో భాగంగా శివనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ కొమ్మోజు చేసిన విద్యా, సాహిత్య సేవలను గుర్తించి ఢిల్లీకి ఆహ్వానం పంపారు.
దీంతో ఆయన ఈనెల 17న ఢిల్లీకి ముఖ్య అతిథులు సెంట్రల్ జిఎస్టి చీఫ్ కమిషనర్ ఎస్ కే రహమాన్, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ దాడి సత్యనారాయణ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు తెలిపారు. కాగా విద్య, సాహిత్య సేవలను గుర్తించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుతో సత్కరించిన నిర్వాహకులకు ఈ సందర్భంగా శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.