పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 25: పాలకుర్తి మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు జే గ్రామంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి లబ్ధిదారులను రెవెన్యూ, పోలీస్ అధికా రులు ఖాళీ చేయించేందుకు యత్నించగా తిరగబడ్డారు. ఈ క్రమంలో పసులాది ఆంజమ్మ, జోగు ఇందిర, గడ్డం భూలక్ష్మి పెట్రోల్ పోసుకొని అంటించుకునేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..గత కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం 20 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. పూర్తయిన వాటికి రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
పట్టా సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో అధికారులకు సమాచారమివ్వకుండానే పది నెలల క్రితం లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సైలు సాయిప్రసన్నకుమార్, సృజన్ కుమార్, యాకూబ్హుస్సేన్ ఆధ్వర్యంలో గృహాలను ఖాళీ చేయించారు. దీంతో కోపోద్రిక్తులైన లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకుల ప్రోద్భలంతోనే అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారని, ఈ పాపమంతా వారిదేనని మండిపడ్డారు. అక్రమంగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో డీఎస్ వెంకన్న హెచ్చరించారు. త్వరలో గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.
కాంగ్రెస్ నాయకుల కుట్రలతోనే
కాంగ్రెస్ గ్రామ నాయకుల కుట్రతోనే ఇళ్లు ఖాళీ చేయించిన్రు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇళ్లు. ఆయన పొమ్మంటేనే పోయాం. గ్రామ సభ నిర్వహించి కూడా మమ్ముల్ని ఎంపిక చేసిన్రు. పెట్రోల్ పోసుకుని చస్తం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలకు మా పేదల పాపం తగులుద్ది.
– పసులాది అంజమ్మ, లబ్ధిదారురాలు