కాశీబుగ్గ, డిసెంబర్ 19 : వరంగల్ నగరంలోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ కూల్చివేతపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇటీవల కార్మికులకు సంబంధించి న స్థలాన్ని కబ్జా చేసి అందులో ప్రైవేట్ కాంప్లెక్స్‌కు భూమిపూజ చేసిన విషయమై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. ఈమేరకు గురువారం వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ ఆ స్థలాన్ని పరిశీలించి ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తహసీల్దార్ కీలక ఆదేశాలు జారీ చేయడంతో కబ్జాదారుల వెన్ను ల్లో వణుకు మొదలైంది.
గిర్మాజీపేట, డిసెంబర్ 19 : అజంజాహి మిల్లు కార్మికులు, వారి కుటుంబాలకు తనతో పాటు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఒక కార్మికుడి బిడ్డగా తన ప్రాణం ఉన్నంత వరకు వారి పక్షాన నిలబడతానని భావోద్వేగంతో పేర్కొన్నారు. నగరంలోని అజంజాహి మిల్లు కార్మిక భవన్‌ను ఆక్రమించుకొని దానిని నేలమట్టం చేసిన నేపథ్యంలో గురువారం నరేందర్ శివనగర్‌లోని తన ఇంటివద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజంజాహి కార్మిక భవన్ స్థలం ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ చర్యలు తీసుకొని వారిపై చార్జిషీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు వారే దగ్గరుండి ఈ తతంగం నడిపి, మళ్లీ అతడే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పడం హేయమన్నారు. గతంలో వర్ణం షాపింగ్‌మాల్‌ను ఎందుకు కూల్చారు? బేరం కుదరడంతోనే ఇప్పుడు ఇబ్బంది పెడతలేరా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
కార్మిక భవన్ కూల్చిన స్థలం వద్ద కొబ్బరికాయ కొట్టిన సదరు నేత ప్రస్తుతం ఆ విషయాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానికి కారణం బేరం కుదరకనా లేదా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదనా? అని అడిగారు. కార్మిక భవన్ స్థలాన్ని ఎవరు అమ్మితే ఈ బట్టల షాపు యజమాని కొన్నారనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్మికుల స్థలం ఆక్రమించుకున్న వారి వెనకాల ఉన్న దొంగలెవరు? ఎవరు దీనిని ప్రోత్సహిస్తున్నారు? ఎవరు ఆ స్థంలో నిర్మాణం చేపడుతున్నారు? అని ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో కొండా మురళి స్పష్టతలేని మాటలు మాట్లాడారని, తూర్పు నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడేదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కార్మికుల స్థలంలో కార్మిక భవనం కట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కార్మిక భవన్ నిర్మాణానికి తానే మొదటి అడుగు వేస్తానని నరేందర్ తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి, దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ తుమికి రమేశ్‌బాబు, కుందారపు రాజేందర్, కొంతం మోహన్, ఆర్టీఏ మాజీ సభ్యుడు గోరంట్ల మనోహర్, మహిళా నాయకురాలు సింగిరెడ్డి యశోద, నాయకులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ, డిసెంబర్ 19 : అజంజాహి మిల్లు కార్మికుల భవనం స్థలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ వెంటనే నిధులు మంజూరు చేయించి కార్మిక భవనాన్ని నిర్మించాలని మాజీ మేయర్ డాక్టర్ టీ రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం కాశీబుగ్గ ఓ సిటీలోని ప్రదీప్‌రావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీపురావుతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి వాటిని కాపాడే బాధ్యతను జిల్లా యంత్రాం గం తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ స్థలాలను కాపాడుకోలేని జిల్లా యంత్రాంగం ప్రజలను ఏమి కాపాడుతుందని అన్నారు. హైడ్రా పేరుతో అనుమతి ఇచ్చిన వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతోనే నగరం నడిరోడ్డున కార్మికుల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు స్పందించాలని టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారులు ఎలా పేరు మార్చారని ప్రశ్నించిన ఆయన అనుమతులను ఇచ్చిన వారిని వెంట నే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థలం యజమాని రాజిరెడ్డికి వారసులు లేరని తెలిపారు.
వెంటనే మంత్రి కొండా సురేఖ స్పందించి కార్మిక భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి అక్రమాలు పునరావృతం కావని తెలిపారు. వస్త్ర వ్యాపారితో వెంటనే ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాము ముందుండి ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వంగాల సమ్మిరెడ్డి, సముద్రాల పరమేశ్వర్, బైరి మురళీకృష్ణ, పోలెపాక మార్టిన్ లూథర్, గడల కుమార్‌యాదవ్, మామిడి సతీశ్ కట్టర్, కొమాకుల నాగరాజు, కనుకుంట్ల రంజిత్, ఎరుకల రఘునాథరెడ్డి, కందిమల్ల మహేశ్, రత్నం కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ, డిసెంబర్ 19 : అజంజాహి మిల్లు కార్మికుల యూనియన్ భవనం పేద కార్మికులకే చెందేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. గురువారం కాశీబుగ్గ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ తూర్పు ప్రజల నమ్మకంతోనే బీసీ నాయకుడిగా ఎదిగానని, 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ భూముల కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు.
కాసం ఓం నమః శివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్‌లో కలిసి వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని చెప్పి ఆహ్వానిస్తేనే శంకుస్థాపనకు వెళ్లానని తెలిపారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని చెప్పారు. అజంజాహి గ్రౌండ్‌లోని కార్మిక భవనం స్థలం కుడా పరిధిలో లేదని రికార్డులు చూపుతున్నాయని తెలిపారు. భవనం కబ్జా వ్యవహారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషిచేస్తానని తెలిపారు.
పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండా మురళి చరిత్రలో లేదని తెలిపారు. మిల్లు భూముల జోలికి వెళ్లిన వాళ్లందరూ నష్టపోతారని హెచ్చరించారు. వెంటనే నిర్మా ణ పనులను నిలిపివేయాలని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాతే నిర్మాణం చేయాలన్నారు. అవసరమైతే కార్మికులకు స్థలం కొనుగోలు చేసి భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మిల్లు రిటైర్డు కార్మికులు, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.