శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి జిల్లా అతలాకుతలమైంది. ఒక్కసారిగా వడగండ్ల వాన జిల్లాపై విరుచుకుపడింది. దీంతో చేతికొచ్చిన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పంటలు నేలవాలడంతో అన్నదాత ఆగమాగమయ్యాడు.
నర్సంపేట, మార్చి 19: నర్సంపేట డివిజన్లో శనివారం అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పట్టణంలో ఆరుబయట ఉన్న గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. నర్సంపేటలో 6.2, దుగ్గొండిలో 5.1, నల్లబెల్లిలో 4.8, ఖానాపురంలో 7.0, చెన్నారావుపేటలో 3.0, నెక్కొండలో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. అర్ధరాత్రి తర్వాత వడగండ్లతో వర్షం విరుచుకుపడింది. దీంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. మామిడి చెట్లు విరిగిపడ్డాయి. కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.
నెక్కొండ/చెన్నారావుపేట/ఖానాపురం: నెక్కొండ మండలంలో మక్కజొన్న సాగు చేసిన రైతులు ఆగమాగమయ్యారు. మండలంలో 11 వేలకు పైగా ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, ప్రాథమికంగా 4420 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు ఏవో నాగరాజు తెలిపారు. నెక్కొండలోని గుండ్రపల్లిరోడ్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గద్దె గాలివానకు కూలిపోయింది. దీంతో సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెన్నారావుపేట మండలవ్యాప్తంగా వడగండ్ల వానకు మెక్కజొన్న, మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో 5631 ఎకరాల్లో మక్కజొన్న పంటనష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అక్కల్చెడలోని ముత్యం భద్రయ్యకు చెందిన రూ. 50 వేల విలువైన పాడి గేదె మృతి చెందింది. అమీనాబాద్‌లో ఊరుగొండ సరోజన ఇల్లు ధ్వంసమైంది. మండలంలోని పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఖానాపురం మండలంలో 2400 ఎకరాల్లో మక్కజొన్న పంట పూర్తిగా నెలకొరిగింది. 150 ఎకరాల్లో మిర్చి కాత మొత్తం రాలిపోయింది. ఆరు వేల ఎకరాల్లో సాగు చేసిన వరి పొలాలు దెబ్బతిన్నాయి. 36 ఎకరాల్లో కూరగాయల పంటలు, 16 ఎకరాల్లో వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో 150కి పైగా ఇళ్లకు నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడమే కాకుండా తీగలు తెగిపోయాయి. దీంతో సరఫరా నిలిచిపోయింది. పంటలు, ఇండ్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జేడీఏ ఉషాదయాళ్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, ఏవో శ్రీనివాస్, ఏఈవోలు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు.
నల్లబెల్లి: మాయదారి వడగండ్ల వాన రైతన్నల కొంపముంచింది. నల్లబెల్లి మండలంలోని మేడెపల్లి, కొండాపూర్, రంగాపూర్ తదితర గ్రామాల్లో మిర్చి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్న రైతులకు భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తమను నిలువెల్లా ముంచిందని మేడెపల్లికి చెందిన మక్కజొన్న సాగు చేసిన రైతు ఆవుల ఐలయ్యతోపాటు రంగాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి పవన్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గీసుగొండ: మండలంలో వడగండ్ల వానకు రైతులు ఊహించని విధంగా పంట నష్టం జరిగింది. సుమారు 10,500 ఎకరాల్లో మక్కజొన్న పంట, 350 ఎకరాల్లో కూరగాయల పంటలు, మరో 4 వందల ఎకరాల్లో అరటి, మునగ, మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొమ్మాలలో అరటి తోటలో చెట్లు విరిగిపోయి గెలలు కిందపడ్డాయి. కోనాయిమాకులలో మునగ తోట ధ్వంసమైంది. దస్రుతండాలో కేలోత్ బాలు ఇల్లు దెబ్బతిన్నది. గ్రేటర్ వరంగల్ ధర్మారంలో పరశురాములు, రాజయ్య, సమ్మయ్య, ఈదుల కుమార్‌కు చెందిన 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అలాగే, ఈదురుగాలులు, వడ్లగండ్ల వానకు మండలంలోని భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న హోర్డింగ్‌లు విరిగిపోయాయి. ప్రధాన రోడ్లపై భారీ వృక్షాలు నేలవాలడంతో సర్పంచ్‌లు ఆదివారం జీపీ సిబ్బందితో తొలగింపజేశారు. మండలంలోని గంగదేవిపల్లి, కొమ్మాల, విశ్వనాథపురం, దస్రుతండాలో దెబ్బతిన్న పంటలను జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, తహసీల్దార్ విశ్వనారాయణ, ఏవో హరిప్రసాద్‌బాబు పరిశీలించి అన్నదాతలకు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా గాలివాన బీభత్సానికి మండలంలోని విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. అధికారులు మరమ్మతులు మొదలుపెట్టారు.
వర్ధన్నపేట: వడగళ్ల వానకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతిన్నాయి. మూడు నెలలుగా మక్కజొన్న పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టిన రైతులను అకాల వర్షం నట్టేట ముంచింది. రైతులు మక్కజొన్న సాగుకు ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కంకి పాలుపోసుకునే దశలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంట పూర్తిగా నేలకొరిగింది. అలాగే, మామిడి తోటల్లో కాయలు ఏపుగా పెరిగి మరో 20 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో కాయలు నేలరాలిపోయాయి. కాగా, మండల పరిధిలోని 8 గ్రామాల్లో భారీగా పంటనష్టం జరిగినట్లు అధికారులు అంచనా చేశారు. ఏవో రాంనర్సయ్య ఆధ్వర్యంలో ఏఈవోలు క్లస్టర్ల వారీగా పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. ఇల్లంద, చెన్నారం, కొత్తపల్లి, ల్యాబర్తి, బండౌతాపురం, వర్ధన్నపేట, డీసీతండా, నల్లబెల్లి, దమ్మన్నపేటలో 707 మంది రైతులకు చెందిన 1,205 ఎకరాల్లో మక్కజొన్న పంట 50 శాతానికి పైగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, 194 మందికి చెందిన 265 ఎకరాల్లో మామిడి తోటల్లో 50 శాతానికి పైగా కాయలు రాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
రాయపర్తి/పర్వతగిరి: రాయపర్తి మండలంలోని 39 గ్రామాల పరిధిలో జరిగిన పంట నష్టాలను తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏఈవో కడుదూరి రాజేశ్‌కుమార్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అంచనా వేశాయి. సుమారు 400 హెక్టార్లలో మక్కజొన్న పంట నేలవాలగా, 40 హెక్టార్లలో మామిడి తోటల్లో పిందె దశలో ఉన్న కాయలు నేలరాలినట్లు అంచనా వేస్తున్నట్లు ఏవో తెలిపారు. తిర్మలాయపల్లి-వర్ధన్నపేట రోడ్డులో ఓ భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు స్తంభించాయి. రాయపర్తి, బంధన్‌పల్లి, కొత్తూరు, ఏకేతండా, సూర్యతండా, జగన్నాథపల్లి, మైలారం, గట్టికల్, ఊకల్, బురహాన్‌పల్లిలో తీవ్రంగా పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు, చింతనెక్కొండలో వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా 2800 ఎకరాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నదని ప్రాథమిక అంచనా వేసినట్లు ఏవో టీవీఆర్‌ఆర్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి శంకర్, తహసీల్దార్ కోమీ, ఏఈవో రాకేశ్, సర్పంచ్ గటిక సుష్మా పంటలను పరిశీలించారు. ఏనుగల్లులో సుమారు 500 ఎకరాల మక్కజొన్న నేలవాలింది. చింతనెక్కొండలో 400 ఎకరాలు, పర్వతగిరిలో సుమారు 300 ఎకరాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఏనుగల్లులో జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తాను పర్వతగిరిలో సాగు చేసిన నాలుగు ఎకరాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతు సముద్రాల సాంబమూర్తి వాపోయాడు.
నర్సంపేటరూరల్: నర్సంపేట మండలంలో వేల ఎకరాల్లో మక్కజొన్న, వరి, మిర్చి తోటలు నేలవాలాయి. మామిడి కాయలు నేలిపోయాయి. మండలంలోని ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, ఆకులతండా, రాజుపేట, గార్లగడ్డతండా, కొండ సముద్రంతండా, హనుమాన్‌తండా, ఇప్పల్‌తండా, ఏనుగల్తండా, దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, మర్రినర్సయ్యపల్లి, భోజ్యానాయక్‌తండా, రాజేశ్వర్రావుపల్లిలో మిర్చి తోటలు, వరి, మక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గురిజాల, గుర్రాలగండిరాజపల్లి, చిన్నగురిజాల, గుంటూరుపల్లి, మాదన్నపేట, మహేశ్వరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేటలో మక్కజొన్న పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి. గురిజాలలో అరటితోటలకు నష్టం వాటిల్లింది. మర్రినర్సయ్యపల్లి, లక్నేపల్లిలో 27 గొర్రెలు మృతి చెందాయి. ముగ్దుంపురం శివారు నర్సంపేట-నెక్కొండ, నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారులకు ఇరువైపులా వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముగ్దుంపురం శివారు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. చిన్న గురిజాలలో పలు ఇండ్లు కూలిపోయాయి. దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులు పరిశీలించారు. రాజపల్లి, గురిజాల, చిన్న గురిజాలలో జేడీఏ ఉషాదయాళ్, ఏడీఏ అవినాశ్ శర్మ, ఏవో కృష్ణకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఏఈవో సిందూ కిరణ్మయి పంటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, ఆకులతండా, చంద్రయ్యపల్లి, భోజ్యానాయక్‌తండా, భాంజీపేట, గురిజాల, జీజీఆర్‌పల్లి, చిన్న గురిజాల, మాదన్నపేటలో వ్యవసాయాధికారులు పరిశీలించారు. అలాగే, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు కట్ల సుదర్శన్‌రెడ్డి, రాము, బోరగాని కృష్ణ, సోనబోయిన రణధీర్‌కుమార్, మండల రాజమౌళి, రాజేశ్వరరావు, శంకర్లింగం పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలవ్యాప్తంగా వడగండ్ల వానకు వందల ఎకరాల్లో మిర్చి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గొల్లపల్లి, గోపాలపురం, రేఖంపల్లి, తొగరామయ్యపల్లి, ముద్దునూరు, గుడ్డేలుగులపల్లి, తిమ్మంపేట, మహ్మదాపురం, వెంకటాపురం, చలపర్తిలో వాణిజ్య పంటలకు నష్టం జరిగింది. రోడ్లకు అడ్డుగా స్తంభాలు, వృక్షాలు విరిగిపడ్డాయి. తిమ్మంపేట, రేఖంపల్లి, మహ్మదాపురంలో ఎక్కువ శాతం మిర్చి పంట దెబ్బతిన్నది. చాపలబండలో వడగండ్ల బీభత్సానికి పలు గొర్రెలు బావిలో పడి మృతి చెందాయి. కాగా, ఆదివా రం ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రేఖంపల్లి, వెంకటాపురం, గొల్లపల్లి, తిమ్మంపేట పీజీతండా, రంగాపురం, చాపలబండలో మక్కజొన్న, మిర్చి పంటలను వారు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జేడీఏ ఉషాదయాళ్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు సర్వేలో పాల్గొని రైతులతో మాట్లాడారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అధికారులకు పంపిస్తామన్నారు.
సంగెం: వడగండ్లతో మండలంలో అపారనష్టం జరిగింది. మొండ్రాయి, నార్లవాయి, నల్లబెల్లి, పల్లార్గూడ, సంగెం, చింతలపల్లి, కృష్ణానగర్, వంజరపల్లి, గొల్లపల్లి, కుంటపల్లిలో మక్కజొన్న, అరటి, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గొల్లపల్లిలో గొర్రెలపై రాళ్ల వాన పడడంతో పెరబోయిన మల్లయ్య, మేరుగు స్వామి, ఇమ్మడి కట్టయ్య, బాబు కట్టమల్లుకు చెందిన 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మొండ్రాయి-పల్లార్గూడ గ్రామాల మధ్య చెట్లు కూలి విద్యుత్ స్తంభాలపై పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వంజరపల్లిలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లులోని రేకులు గాలికి ఎగిరిపోయాయి. నిల్వ ఉన్న 5 లారీల వడ్లు తడిచాయి. రూ. 15 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు కౌడగాని శంకర్రావు తెలిపారు. పంటలను తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఏవో యాకయ్య, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, క్లస్టర్ల ఏఈవోలు పరిశీలించారు. 8,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.