తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చే చర్యల్లో భాగంగా మత్స్యకారులకు ఏటా ఉచితంగా చేప పిల్లల పంపిణీతోపాటు వలలు, వాహనాలు, ఆటోలు సబ్సిడీపై అందిస్తోంది. ఏడేండ్లుగా ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలు పెరిగిన తర్వాత విక్రయిస్తూ మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని 732 చెరువులు, ఇతర జలాశయాల్లో 2కోట్ల 72లక్షల 39వేల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కావడంతో ఈనెల 26 నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో 170 మత్స్యకార సంఘాల్లో ఉన్న 16వేల 500మంది సభ్యులు ఈసారి కూడా ఉపాధి పొందనున్నారు.
జనగామ రూరల్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఎదుగుదలకు ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. జిల్లాలో 732 చెరువులు, ఇతర జలాశయాలు ఉండగా, వాటిల్లో ఈ ఏడాది 2కోట్ల 72లక్షల 39వేల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 26న పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 170 మత్స్యకార సంఘాలు ఉండగా, అందులో 16వేల 500మంది సభ్యులు ఉన్నారు.
బంగారుతీగ, రొయ్య, బొచ్చె, రొహులు, బొమ్మె, కొర్రమీను తదితర రకాల చేపపిల్లలను ఉచితంగా జలాశయాల్లో జిల్లాలో మత్స్య ఉత్పత్తి పెరుగుతున్నది. చేపలను జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈక్రమంలో మత్స్యకారులు, వారి కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి లభించి కోట్లలో పొందుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది.
మత్స్యకార కుటుంబాల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. చేపలను పట్టేందుకు వలలు, రవాణా కోసం ద్విచక్ర వాహనాలు, ఆటోలు అందిస్తోంది. అదేవిధంగా మహిళా సహకార సంఘాలను బలోపేతం చేయడానికి వారికి రుణాలు అందిస్తోంది. అలాగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ సైతం నిర్వహించి, ఉపాధి కల్పిస్తోంది. నీలివిప్లవం పేరుతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు మత్స్యకారుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయి.
జిల్లాలో 732 చెరువులు, కుంటలు, జలాశయాలు ఉన్నాయి. జూలైలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండి జలకళ సంతరించుకుంది. దీంతో ఈఏడాది 272.39లక్షల చేపపిల్లలను నీటిలో వదలనున్నారు. జిల్లాలో చేపపిల్లల కొనుగోలు టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, ఈనెల 26 నుంచి పంపిణీ చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. 2016-17లో రూ.63.15లక్షల ఖర్చుతో 70.17లక్షల చేపపిల్లలు, 2017-18లో రూ.103.81లక్షలతో 146.62లక్షల చేపపిల్లలు, 2018-19లో రూ.121.55లక్షలతో 146.52లక్షల, 2019-20లో రూ.143.18లక్షలతో 221.39లక్షలు, 2020-2021లో రూ.139.77లక్షలతో 254.45 లక్షల, 2021-2022లో రూ.70.35లక్షలతో 123.72లక్షల, 2022-2023లో రూ.129.77లక్షలతో 265.87 లక్షల చేపపిల్లలను పంపిణీ చేసింది. ఇందుకు ప్రభుత్వం మొత్తం రూ.7కోట్ల 71లక్షల 58వేలు ఖర్చు చేసింది. 2023-24లో 272.39లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయనుంది.