విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు నలుగురిపై వేటు పడింది. జీపీ ఖాతా నుంచి నిధులు కాజేసినందుకు తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావును, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు వరంగల్ డీటీవో గంధం లక్ష్మిని, అలాగే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు దొబ్బలపాడు పీఈటీ మంతెన భానుప్రకాశ్, కూనూరు జీపీ కారోబార్ క్రాంతికుమార్‌పై ఆ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సంచలనం రేపింది. ఈ నిర్ణయంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతుండగా అవినీతి అధికారుల్లో దడ మొదలైంది.
తొర్రూరు ఎంపీడీవో సస్పెన్షన్
ఎంపీవోకు షోకాజ్ నోటీసులు
తొర్రూరు, జనవరి 9 : తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావును సస్పెండ్ చేయడంతో పాటు ఎంపీ వో పూర్ణచందర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులను ఇస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 4న పెద్దవంగర మండలం బొమ్మకల్లు జీపీ ఖాతాలోంచి అక్రమంగా రూ.1.10 లక్షల నగదును డ్రా చేసి తిరిగి 6న జమచేసినందుకు గాను కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో పెద్దవంగర ఎంపీడీవో బి.వేణుమాధవ్‌కు తొర్రూరు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించా రు. అంతేగాక ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో కలిసి మరికొంతనగదు కాజేశారని అధికారులు, సిబ్బందిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పీఈటీ అసభ్య ప్రవర్తన
ఉద్యోగం నుంచి తొలగింపు
మహాముత్తారం, జనవరి 9 : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీపై వేటు పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి, దూషించిన వ్యాయామ ఉపాధ్యాయుడు(ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) మంతెన భానుప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల అదనపు డైరెక్టర్ శ్రీనివాసాచారి ఆదేశాలు జారీ చేసినట్లు దొబ్బలపాడు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రవి తెలిపారు.
వరంగల్ డీటీవో సరెండర్
ఖిలావరంగల్, జనవరి 9 : వరంగల్ రవాణా శాఖ అధికారి గంధం లక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై నిర్లక్ష్యం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షలో డీటీవో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. 24గంటల్లో సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా డీటీవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమెపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కార్యాలయం ఎదుట ఏజెంట్లుగా చలామణి అవుతున్న కొంతమందిని సెక్యూరిటీ గార్డుగా నియమించి వారితో పనులు చక్కపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాక కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడం, ఆన్లైన్ ప్రక్రియ సకాలంలో నమోదు కావడం లేదని ప్రజాప్రతినిధులు, ఓ సంస్థ చైర్మన్ ఇటీవల ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా డీటీవో సరెండర్‌తో ప్రభుత్వ అధికారుల్లో అలజడి మొదలైనట్లు తెలిసింది.