హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15 : వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 21వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. శుక్రవారం నిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ విజయ్‌కుమార్ సరస్వత్ పాల్గొంటారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ విజయ్‌కుమార్ అనుభవాలు గ్రాడ్యుయేట్లకు అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. కాన్వొకేషన్లో మొత్తం 2,029 మంది అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారన్నారు. ఇందులో 126 మంది పీహెచ్డీ, 603 మంది ఎంటెక్, ఏడుగురు పీజీ డిప్లొమా, 154 మంది ఎమ్మెస్సీ, 23 మంది ఎంబీఏ, 52మంది ఎంసీఏ, 1,064 మంది బీటెక్ అలాగే ప్రతి బ్రాంచ్ టాపర్‌కు రోల్ ఆఫ్ హానర్ గోల్డ్ మెడల్, మొత్తం టాపర్ (అన్ని బ్రాంచ్‌లను పరిగణనలోకి తీసుకుని) ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ శరత్‌బాబు, 21వ స్నాతకోత్సవ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కాన్వొకేషన్లో 8 విభాగాల నుంచి 8 మంది టాపర్స్‌కు గోల్డ్‌మెడల్ అందించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఇందులో యాదారి రేవంత్(సివిల్ ఇంజినీరింగ్), కారాప భవానీశంకర్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), చిన్ని రేవంత్(మెకానికల్ ఇంజినీరింగ్), సుదీప్తి మడ్డి(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ఎం తరుణ్(మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్), ప్రత్యూష దయాల్(కెమికల్ ఇంజినీరింగ్), సూదిరెడ్డి దినేశ్‌రెడ్డి(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్)కి గోల్డ్మెడళ్లతో పాటు బయో టెక్నాలజీ బ్రాంచ్‌కు చెందిన నివేదిత ఉలగనాథన్ ఇనిస్టిట్యూట్ టాపర్‌గా గోల్డ్ మెడల్ అందుకోనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
1. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో రికార్డు సంఖ్యలో విద్యార్థుల ఎంపిక.
2. అత్యధిక వేతన ప్యాకేజీ సంవత్సరానికి రూ.88 లక్షలు, సగటు ప్యాకేజీ 17 లక్షలు. ఈ సంవత్రరం వేతన ప్యాకేజీ దాదాపు 17 శాతం పెరిగింది. పరిశోధన ఔట్రీచ్..
1. మొత్తం 423 జర్నల్స్ ప్రచురితమయ్యాయి.
2. నిట్ అధ్యాపకులు 20 పేటెంట్లు పొందారు.
3. 45 పరిశోధనా ప్రాజెక్టులు, 36 కన్సల్టెన్సీలు సంస్థ అందుకున్నది.
4. పరిశోధన కోసం గ్రాంట్ రూ.3.38 కోట్లు, కన్సల్టెన్సీ కింద రూ.3.35కోట్లు.
5. 160 పుస్తకాలు, పుస్తక అధ్యాయాలను అధ్యాపకులు ప్రచురించారు.
6. అధ్యాపకులు 210 మంది నిపుణుల ఉపన్యాసాలు అందించారు.
7. నిట్‌లో మొత్తం 90 గెయిన్, స్పార్క్, ఎఫ్డీపీలు నిర్వహించాం.
8. అంతర్జాతీయ వక్తలు సుమారు 20 ఉపన్యాసాలు ఇచ్చారు.