స్టేషన్ ఘన్పూర్, మార్చి 20 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం, బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఆమోదం పొందడంతో సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి సింగపు రం ఇందిరతోపాటు ఇతరుల చిత్ర పటాలకు రాష్ట్ర మహిళా కార్యదర్శి మౌనిక, మండల అధ్యక్షురాలు నారగోని పద్మల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
కాగా ఈ ఫ్లెక్సీలో నియోజక వర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఫొటోలు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తమను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కడియం వారితో చర్చించక పోవడంతో గురువారం ఎమ్మెల్యే, ఎంపీల ఫొటోలు లేకుండానే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న గ్రూపులకు స్వస్తి పలకాలంటే రాష్ట్రస్థాయిలో నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరకు రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చే పదవిని ఇవ్వాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారు సీఎం ను కోరారు. విజయ, అనిత, బాలమణి, లక్ష్మి, సునీత, రేణుక, సకుబాయి, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.