మహబూబాబాద్ : తొర్రూర్ పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మార్క సాంబయ్య పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటికీ పేదలకు కేటాయించకుండా ఉండటం దారుణమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. లేకపోతే సీపీఎం నేతృత్వంలో రాస్తారోకో, దీక్షలు నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు డోనక దర్గయ్య, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, కమిటీ సభ్యుడు రవి, అర్హులైన నిరుపేదలు శ్రీలత, శోభ, వరలక్ష్మి, షమీనా, శ్రీరామ్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.