జయశంకర్ భూపాలపల్లి, మే 21(నమస్తే తెలంగాణ)/మహదేవపూర్ (కాళేశ్వరం) : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోతున్నారు. బుధవారం తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష పైచిలుకు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో పుషర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వరంలోని స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉచిత బస్సులు సరిపడా లేక భక్తుల ఇబ్బందులు
కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో చేరుకుంటున్న భక్తులు తాత్కాలిక బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు సుమారు కిలోమీటరు లగేజీతో నడవలేక ఎండల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సింగరేణి సహకారంతో 19 సింగరేణి స్కూల్ బస్సులు, ప్రస్తుతం మరో ఐదు ఎలక్ట్రిక్ ఆటోలను ఏర్పాటు చేసినా పెరుగుతున్న రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో భక్తులు కాలినడకన లగేజీతో పుష్కర ఘాట్‌కు వెళ్లి అక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు.
ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో గంటల సమయం క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయలేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఓ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో వీఐపీ ఘాట్ వద్ద టెంట్లు కూలిపోయా యి. భారీ కటౌట్ ప్రధాన రహదారిపై విరిగిపడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
వీఐపీలకే పెద్ద పీట వేస్తున్నారు
విధుల్లో ఉన్న అధికారులు వీఐపీల సేవలోనే ఉంటున్నారు. ఇదేంటి ప్రశ్నిస్తే భక్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన వస్తున్నది. చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– అభినవ్, హైదరాబాద్
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
వర్షాలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో సింగరేణి రెస్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వాకీటాకీల ద్వారా సంబంధిత బృందాలతో రక్షణ చర్యలు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వ హించారు. విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి పరిస్థితులకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీకనుగుణంగా అదనంగా పారింగ్ స్థలాలను గుర్తించనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నిర్మించిన వసతి గృహమే దిక్కు
కాళేశ్వరంలో వంద గదుల వసతి గృహమే పెద్ద దిక్కయ్యింది. రూ.8 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని నిర్మించగా, చిన్నచిన్న పనులు మినహా అన్నీ పూర్తి చేసింది. ప్రస్తుతం సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఈ వసతి గృహం అధికారులందరికీ సౌకర్యంగా ఉంది. కాళేశ్వరంలో ఇంత పెద్ద వసతి గృహాలు లేకపోవడంతో పుష్కర డ్యూటీలో ఉన్న అధికారులందరికీ ఇందులో వసతి కల్పించారు. కింద సెల్లార్లో వంటలు చేయ డం, భోజనాలు వడ్డించడం చేస్తున్నారు. ఈ వసతి గృహం లేకుంటే అధికారుల విడిదికి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చేదని, కేసీఆర్ ముందు చూపుతో చేసిన పనులు ఇప్పటికీ గుర్తుంటాయని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
అంతా గందరగోళం..
భక్తుల రద్దీ కనుగుణంగా వసతులు లేక అంతా గందరగోళంగా ఉంది. గంటల తరబడి క్యూలో నరకయాతన పడాల్సి వస్తున్నది. ఇకడ ఎవరూ పట్టించుకోవడం లేదు. దర్శనం కోసం వస్తే ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు.
– మధుకర్, మంచిర్యాల
గోదావరి నదికి పోవుడెట్ల?
నది దగ్గరికి పోయేందుకు పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు. నడుచుకుంటా వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే బాగుండేది. అధికారుల తీరంతా డూడూ బసవన్నలా ఉంది. ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలి.
– సంతోషి, హైదరాబాద్