ఐనవోలు, జనవరి 14: మమ్మేలు మల్లన్నకు కోటి దండాలు అంటూ భక్తజనం స్వామి వారిని దర్శించుకుని తరించింది. భోగి సందర్భంగా శనివారం ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రాత్రే ఆలయానికి చేరుకొని విడిది చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. విడిది చేసిన చోటే భక్తులు బోనం చేయగా, ఒగ్గు పూజారులు పట్నాలు వేశారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు.
శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయం మార్మోగింది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పడమర వైపు ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించారు. శాసన మండలి చైర్మన్ బండా ప్రకాశ్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, కార్పొరేటర్ల ఇండ్ల నాగేశ్వర్ రావు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.