వరంగల్/హనుమకొండ/ కాళేశ్వరం, అక్టోబర్ 19 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజుకు చేరగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని లలిత మహా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు. ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం శేష వాహన సేవపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. భద్రకాళీ మాతను దర్శించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ కమిషనర్ విశాలీ దయాళ్, రీజినల్ పీఎఫ్ కమిషనర్ ప్రణీత్ జోషి, రవికుమార్ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ఈవో శేషు భారతి వారికి అమ్మవారి శేష వస్ర్ర్తాలు, ప్రసాదాలను అందచేశారు. ఎంజీఎం సెంటర్లో ఉన్న రాజరాజేశ్వరీ ఆలయంలో అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ పార్వతి, మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. ఉదయం గణపతి, లలితార్చన పూజలు, ఉదయం 6 గంటలకు పంచమి విశేష పూజ, 9గంటల నుంచి 11 గంటల వరకు గణపతి, నవగ్రహ, రుద్ర పంచసూక్త హోమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర చండీహోమం జరుగగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు కాత్యాయనీ మాత అలంకారం చేయనున్నట్లు అర్చకుడు కృష్ణముర్తి శర్మ తెలిపారు.
హనుమకొండ పద్మాక్షి కాలనీలోని హనుమద్గిరి పద్మాక్షి ఆలయంలో అమ్మవారు స్కంద మాత (ఉపాంగ లలిత) అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించి లక్ష పుష్పార్చన చేసినట్లు అర్చకుడు నాగిళ్ల శంకర్ శర్మ, వేద పండితుడు నాగిళ్ల షణ్ముక పద్మనాభ అవధాని తెలిపారు.