ఖిలావరంగల్, ఏప్రిల్ 8: స్లమ్‌లెస్ కాలనీగా మైసయ్యనగర్ను తీర్చిదిద్దానని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం మైసయ్యనగర్‌లో 58, 59 జీవోలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైసయ్యనగర్ గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మేయర్‌గా ఉన్నప్పుడు మాటిచ్చి.. ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నానన్నారు. గత పాలకులెవరూ కూడా మైసయ్యనగర్ అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. 18 ఏండ్లలో ఎవరూ చూడలేని అభివృద్ధిని కండ్ల ముందు ఉంచామన్నారు. ప్రతి ఇంటికీ నంబర్ ఇప్పించి మౌలిక వసతులు కల్పించామన్నారు. త్వరలోనే కమ్యూనిటీ భవనం, ప్రాథమిక పాఠశాలకు భవనం నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మైసయ్యనగర్ ప్రజలకు ఎలాంటి సమస్య రానివ్వనని హామీ ఇచ్చారు.
మేయర్‌గా, ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూ.43 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపెట్టామన్నారు. గుడిసెవాసుల కాలనీల అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడనని చెప్పారు. గుడిసె వాసులు 2014 లోపు ఆన్లైన్ చేసుకున్నవారికి పట్టాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని గుర్తుచేశారు. అయితే దానిని కూడా సవరించి, 2020 లోపు ఆన్లైన్ చేసుకున్నవారందరికీ పట్టాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నియోజక వర్గంలోని 43 కేంద్రాల్లో 58, 59 జీవోలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో 7 వేల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇన్నేండ్లు పరిపాలించిన నాయకులు పేద ప్రజల బాగోగులు పట్టించుకోవాలనే సోయి కూడా లేదన్నారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 60 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపెట్టామని ధీమా వ్యక్తం చేశారు. రూ. 3800 కోట్ల నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.1100 కోట్లతో అత్యాధునిక ఏర్పాట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాకానను నిర్మిస్తున్నామన్నారు. రూ.75 కోట్లతో బస్ స్టేషన్, జిల్లా కేంద్రం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తోపాటు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో నియోజకవర్గంలోని 25వేల మందికి సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. నిరుపేద బిడ్డలు గొప్పగా చదువు కోవాలని 7 గురుకులాలు, 2 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. మేయర్, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రజల గోస తీర్చడానికి కంకనబద్ధుడై ఉన్నానన్నారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.