హనుమకొండ, ఆగస్టు 12 : ఎట్టకేలకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం దిగొచ్చింది. రెండు రోజులుగా సమ్మెకు దిగిన 16 సర్కిళ్ల ప్రైవేట్ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లతో మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్ ఆఫీసులో చర్చలు జరిపి పది రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, సీజీఎంలు, ఇంజినీర్లు, సుమారు 80మంది కాంట్రాక్టర్లతో పాటు ఎన్పీడీసీఎల్ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
20 డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వాటన్నింటినీ పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా లేబర్, కాపర్, అల్యూమినియం వైర్ల ధరలు పెంచడంతో పాటు కేటగిరీ-3లో ఎస్ఎస్ఐలో ఉన్న వాటిని కేటగిరీ-2 కమర్షియల్‌లోకి 2017 మార్చి ఏరియర్స్ చెల్లించాల్సి వచ్చిందని, మళ్లీ కేటగిరి-2 నుంచి 3వ కేటగిరీలోకి మార్చి ఏరియర్స్‌ను బిల్లులో సర్దుబాటు చేయాలనే తదితర డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని ఒప్పంద పత్రం రాసివ్వడంతో వెంటనే పనులు ప్రారంభించినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు.
కాంట్రాక్టర్లతో చర్చలు సఫలం అయ్యాయని సీజీఎం ఆపరేషన్-2 కె. రాజుచౌహన్ తెలిపారు. పదేళ్లుగా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నామని, టెండర్లో పాల్గొనాలని కాంట్రాక్టర్లకు సూచించినా సమ్మెకు దిగారని పేర్కొన్నారు. వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎండీతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. చర్చల్లో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, సీజీఎంలు అశోక్‌కుమార్, రాజు చౌహన్, జీఎం సురేందర్, ఈఈ మల్లికార్జున్, డీఈ దర్శన్‌తో పాటు ఎన్పీడీసీఎల్ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కాంట్రాక్టర్ల వేల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్.రెడ్డి, సెక్రెటరీ కాళీప్రసాద్, ఉపాధ్యక్షుడు రవీందర్రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.