మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 18 : ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి డీఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు యశ్వంత్, నరేశ్, రాజేశ్, అన్వేశ్, మహేశ్ మాట్లాడుతూ నీటి కొరత తీవ్రంగా ఉందని, సరిపడా టాయ్‌లెట్స్ లేవని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ అశోక్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాటిని పరిష్కరించకుండా అడిగిన విద్యార్థులను కులం పేరుతో దూషిస్తున్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులంలో మొత్తం 580 మంది విద్యార్థులున్నారని, ఆర్సీవో రత్నకుమారి ఒక్కసారి కూడా హాస్టల్‌ను సందర్శించలేదని ఆరోపించారు.
మెనూ పాటించడం లేదని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, వెంటనే కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై షాకీర్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా చూస్తామని సర్దిచెప్పడంతో విద్యార్థులు శాంతించారు. కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ నాయకులు శాంతి కుమార్, సాయికుమార్, సూర్యప్రకాష్, గౌతమ్, సల్మాన్ పాల్గొన్నారు.