రాయపర్తి, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పాలన లో రైతుల బాధలు ఉద్యమ రథసారధి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు రాష్ట్రంలోని సబ్బండ వర్గాల దృష్టికి తీసుకురావాలనే సూర్యాపేట జిల్లా నెమ్మికల్ నుంచి 16 ఎండ్లబండ్లతో అన్నదాతలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గురువారం ఉదయం రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్న ‘బండెనుక బండి కట్టి.. 16 బండ్ల ర్యాలీ’కి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వయం గా ఎడ్లబండిని నడుపుకుంటూ మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా పార్టీ మండల కార్యాలయం వరకు ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17నెలల రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రైతులు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు. సమృద్ధిగా సాగు నీరు రాక, అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే కర్షకలోకం కన్నీరు పెట్టుకున్నదన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన రైతులకు స్వర్ణయుగమన్నారు. ప్రజలను అరిగోస పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనతి కాలంలోనే కూలిపోవడం ఖామయని జోస్యం చెప్పారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు, మహిళలు, విద్యార్థు లు, అన్నదాతలు, రైతు కూలీలు పెద్ద సం ఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్ర దం చేయాలని కోరారు. అనంతరం ఎడ్లబండ్లు వర్ధన్నపేట వైపు సాగిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రంగుకుమార్, పూస మధు, గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, పరుపాటి రవీందర్‌రెడ్డి, మహ్మద్ అక్బర్, అశ్రఫ్పాష, రాం చందర్, సుధాకర్, చందు రామ్‌యాదవ్, సింహాద్రి, మధు, ఎల్లస్వామి, చిన్నాల ఉప్పలయ్య, గారె నరేశ్, మామిండ్ల అశోక్‌కుమార్, పాపిడికాయల రాజు, బల్లెం యాదగిరి పాల్గొన్నారు. కొలన్పల్లికి చెందిన వాసం సత్తమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా, ఎర్రబెల్లి వెళ్లి నివాళులర్పించారు.