వరంగల్, జూన్ 14 : చారిత్రక భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కమీషన్ల మేత మేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రకాళీ చెరువు పూడికతీత పేరుతో కాంగ్రెస్ నాయకులు కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పూడికతీత పనుల్లో పారదర్శకత లోపించిందని, టెండర్లలో గోల్ మాల్ జరిగిందన్నారు. గతేడాది నవంబర్‌లో నీటిని వదిలినా మార్చి వరకు టెండర్లు పిలవకపోవడంలో మతలబేంటని ప్రశ్నించారు. అర్హత లేని వారితో కుమ్ముక్కయిన కుడా, ఇరిగేషన్ అధికారులు కమీషన్ల ప్రాతిపదికనే టెండర్లు కేటాయించారన్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ల కమీషన్ల వాటా కోసమే పనుల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. అసమర్ధ కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించారని మండిపడ్డారు. నత్తనడకన సాగుతున్న పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 15 నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పనులు ఎంత వరకు అయ్యాయో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. వర్షాలు పడితే జరిగిన పనులను ఎలా అంచనా వేస్తారన్నారు. భద్రకాళీ బండ్ నిర్మించినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెరువులో ఐల్యాండ్స్ ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఐల్యాండ్ల నిర్మాణాలతో చెరువును కుదించారని అన్నారు.
మత్తడి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని, పూడితతీత పనుల లెక్కలు తేలే వరకు కాం ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించొద్దని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రకాళీ చెరువుపై ఆధారపడి 800 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయని, వారంతా ఉపాధి కోల్పోయారని అన్నారు. రెండు వేల మంది మత్స్యకారులు నష్టపోతున్నారని వారికి జీవన భృతి చెల్లించాలన్నారు. నీళ్లు నిలిచిన గుంతలో పడి బాలు డు మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహా యం అందజేయాలని దాస్యం డిమాండ్ చేశారు. ఆయన వెంట కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు మరుపల్ల రవి, బోయినపల్లి రంజిత్‌రావు, మేకల బాబురావు, దిడ్డి కుమారస్వామి ఉన్నారు.