హనుమకొండ, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిధులు విడుదల చేస్తే పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తమ పేరు చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నయీంనగర్ నాలా, సమ్మయ్యనగర్ వరద కాలువ నిర్మాణానికి నిధుల కేటాయింపు, జరిగిన పనులు తదితర అంశాలను సోమవారం ఆయన విలేకరులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 ఆగస్టులో వరదలు వచ్చిన సమయంలో మంత్రి కేటీఆర్‌ను ఇక్కడకు తీసుకొచ్చి రూ. 25కోట్లు, 2021లో శాశ్వత పరిష్కారం కోసం రూ. 70 కోట్లు, 2022లో నాలాల ఆధునీకరణ, వరద నివారణ చర్యల్లో భాగంగా రూ. 250 కోట్లు, ఇతర నిధుల నుంచి రూ. 200 కోట్లు, మొత్తంగా రూ. 500 కోట్లకుపైగా నిధులు తెచ్చిన విషయం ప్రజలు మరువలేదన్నారు. అనాడే కేయూ వందఫీట్ల రోడ్డు అండర్ డ్రైనేజీ, నాలా మీద బ్రిడ్జి, ఇతర పనుల కోసం టెండర్లు పిలిచామన్నారు. ఒక్కొక్కటిగా పనులు పూర్తిచేయాలనే ఉద్దేశంతో మొదట నాలాకు రిటెయినింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. వందఫీట్ల రోడ్డు వద్ద అండర్ డ్రైనేజీ పూర్తయ్యిందని, అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు.
తమిళనాడులో బీసీల రాజ్యాధికారం ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు తాను చెన్నై వెళ్లానని, మరి రాజేందర్‌రెడ్డి ఢిల్లీ, అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏడాది కాలం లోనే రూ. 1,000 కోట్ల నిధులు తీసుకొచ్చానని దాస్యం తెలిపారు. నాయిని గెలిచి తొమ్మిది నెలలైందని, ఇప్పటి వరకు తీసుకొచ్చిన నిధులెన్ని? చేసిన అభివృద్ధి ఏమిటి? అన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే పెద్దమ్మగడ్డ శ్మశాన వాటికి గోడ కూల్చిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లు పెట్టించి, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
‘చిల్లర మల్లర రాజకీయా లు, గూండాయిజం, బెదిరింపుల కు భయపడే ప్రసక్తి లేదు.. నీవు గెలిచినపుడు అభినందించిన.. నగర అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన.. అన్ని వర్గాలున్న పశ్చిమ నియోజకవర్గంలో అలజడులు సృష్టించొద్దు’ అంటూ హెచ్చరించారు. వయసుకు కూడా విలువ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడిన పెద్ద మనిషిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకొనేది లేదని దాస్యం స్పష్టం చేశారు. పదవి ఉన్నా.. లేకున్నా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ పార్టీ హామీలపై పోరాడుతూనే ఉంటానన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాద ని… ప్రతీకార పాలన అని దాస్యం ధ్వజమెత్తారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రతిపక్ష నాయకులపై దాడి జరగలేదని, ఇదే మొదటిదన్నారు. శిలాఫలకాలు పగులగొట్టడం, అనుచరులను రెచ్చగొట్టడం, బెదిరింపులకు పాల్పడడ, అధికారం ఉందని పోలీసులతో అక్రమ అరెస్ట్‌లు చేయించడం, కేసులు పెట్టడం తగదని రాజేందర్‌రెడ్డికి హితవు పలికారు. ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌లో రాళ్ల దాడి జరుగుతుంటే నీవు ఎక్కడ దాక్కున్న విషయం ప్రజలకు తెలుసన్నారు.
రాజేందర్‌రెడ్డి తన శైలి, సంస్కృతిని మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవన్‌పై జరిగిన దాడి సరికాదని, తమపై కాంగ్రెస్ దాడి, పోలీసుల అక్రమ అరెస్ట్ హేయమైనవన్నారు. తమపైన దాడి చేసిన వారిని వదిలిపెట్టి, తమమీదే కేసులు పెట్టి పోలీసులు నగరం మొత్తం తిప్పారన్నారు. మేయర్ గుండు సుధారాణి చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞత కే వదిలివేస్తున్నానని తెలిపారు. సమావేశంలో మాజీ చైన్మన్లు సంగంరెడ్డి సుందర్ రాజు, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు