హనుమకొండ, ఏప్రిల్ 16 : తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్మడం మానడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ, ఆంధ్రా విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూ ర్య వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇప్పటికే పీఎం మోదీ సహా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఏర్పాటును అవమాన పరిచినట్లు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు సాగిన 60 ఏండ్ల పోరాటం, తెలంగాణ బిడ్డల బలిదానాలు, ఉద్యమాన్ని బీజేపీ వారి మాటల ద్వారా కించపరచాలని చూస్తున్నదని ఆరోపించారు. దేశమే అబ్బురపడేలా సాగించిన గొప్ప పోరాటాన్ని, తెలంగాణ నేలను తకువ చేసి మాట్లాడడం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని వినయ్‌భాస్కర్ ప్రశ్నించారు. అందుకే ఇంటి పనికైనా, మట్టి పనికైనా మ నోడు ఉండాలని కేసీఆర్ అనేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై అవమానకరంగా మాట్లాడుతున్నా నోరు మెదపని ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్, కేసీఆర్ గులాబీ సైన్యం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండి యా, పాకిస్తాన్ విభజనతో పోల్చడం బీజేపీ మూ ర్ఖపు ఆలోచనా ధోరణికి నిదర్శనమన్నారు. ఇలాం టి అహంకారపూరిత, వ్యతిరేక వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని దాస్యం డిమాండ్ చేశారు.