హనుమకొండ, నవంబర్ 3 : కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో ఆటో కార్మిక నాయకులతో కలిసి మాట్లాడారు. పూర్తి స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించలేని దుస్థితిలో ఉన్నారని, అలాగే రోడ్డునపడ్డ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకపోవడంతో ఇప్పటికే కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేక అసహనంతో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిరంతరం బీఆర్ఎస్ పోరాడుతోందని స్పష్టం చేశారు. 300 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక వర్గ ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10లక్షల మంది అసంఘటిత ఆటో కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు పార్టీలకు అతీతంగా ఆటో కార్మికులంతా జేఏసీగా ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఈ నెల 5న హైదరాబాద్ ఇందిరా పార్ వద్ద జరిగే మహా ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం ఆటో కార్మిక సంఘం నాయకులు ఇసంపల్లి సంజీవ్, మడికొండ బాబు మాట్లాడుతూ..
ఉచిత బస్సు స్కీంతో ఆటో కార్మికులంతా రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. రోజు కనీసం రూ.200 సంపాదించలేకపోతున్నామన్నారు. ఆటో ఫైనాన్స్, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబాన్ని వెళ్లదీయలేక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 57 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అవి ఆటో కార్మికుల ఆత్మహత్యలు కావని, ప్రభుత్వం చేసిన హత్యలేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ నాయకులు రవీందర్ రెడ్డి, జయరాం, రవి, రాంచందర్, నర్సింగ్, నరహరి, రమేశ్, వెంకటస్వామి, సాయిలు, పరశురాములు పాల్గొన్నారు.