హనుమకొండ, ఆగస్టు 19 : కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లు ఆగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ గత రెండు మూడు రోజులుగా ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధకాండ చేపడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నది. నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు శ్రేణులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
బుధవారం శాంతియుతంగా నర్సంపేట బంద్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చిన సందర్భంగా పోలీసులు మళ్లీ అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. ఉదయం నుంచే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను ఇండ్లలోనే నిర్బంధించారు. హనుమకొండలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డితో పాటు శ్రేణులను బయటకు వెళ్లకుండా, ఎవరినీ కలువకుండా అడ్డుకున్నారు. నర్సంపేటకు వెళ్లం అని చెప్పినప్పటికీ హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు, నిర్బంధాలు పెట్టినా పెద్ది విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరుతామని నేతలు స్పష్టం చేశారు.
ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులా?
ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిర్బంధం.. ప్రభుత్వాన్ని నిలదీస్తే హౌస్ అరెస్ట్.. ఇదేనా కాంగ్రెస్ చెప్పుకునే ప్రజా పాలన? నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి నిరసన వ్యక్తం చేస్తుంటే ఉద్యమానికి మద్దతు తెలిపే నాయకులను పోలీసులు అడ్డుకోవడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. విగ్రహం తొలగిస్తే చరిత్ర చెరిగిపోదు.. నాయకుడిని నిర్బంధిస్తే ప్రజల గొంతు మూగబోదు.. ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడం ద్వారా ఆయనపై ఉన్న ప్రజాభిమానాన్ని చెరిపేయలేరు. పెద్దికి జరిగిన అవమానంపై ప్రజల్లో రగిలిన ఆగ్రహాన్ని అణచివేయడం ఎవరి తరం కాదు. నన్ను హౌస్ అరెస్ట్ చేయడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని హౌస్ అరెస్ట్ చేయడమే. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన తప్పును సరిదిద్దుకుని పెద్ది విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి. అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలి.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
నిర్బంధించడం అమానుషం
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు ఆపడం లేదు. పెద్ది విగ్రహం కూల్చివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పోలీసులు ఇండ్లలోకి వచ్చి నిర్బంధించడం అమానుషం. విగ్రహం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాలి. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కొనసాగిస్తామని చెప్పినప్పటికీ నిర్బంధించడం ఏమిటి? ఇలాంటి పాలన గతంలో ఎన్నడూ చూడలేదు.
– నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైతు విముక్తి కమిషన్ మాజీ చైర్మన్
అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి..
ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహాన్ని కూల్చివేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. నర్సంపేట బంద్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అక్రమంగా అరెస్ట్ చేశారు. గతంలో మాదిరిగానే ఇపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీని విధించిందా అనిపిస్తుంది. రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పెద్ది విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరుతాం.
– మర్రి యాదవరెడ్డి, కుడా మాజీ చైర్మన్
రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన
సీఎం రేవంత్‌రెడ్డి రాక్షస పాలనను కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతునొకి, శ్రేణులను చిత్రహింసలకు గురిచేస్తూ ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు, మూడు రోజుల నుంచి పోలీసు నిర్బంధంలో ఉంచుతూ కుటుంబ సభ్యులు, నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు రేవంత్‌రెడ్డి రాక్షస పాలనకు కవచంలా మారుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అరాచక పాలనను అడ్డుకునేందుకు మేం అడుగులు వేస్తుంటే అధికార మదంతో మాపైకి పోలీసులను ఉసిగొల్పి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపునకు నిరసనగా నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విగ్రహాన్ని కూల్చారే తప్ప ప్రజల హృదయాల్లో పెద్దిపై ఉన్న ఆత్మీయతను చెరిపి వేయలేరు. రేవంత్‌ది ప్రజా పాలన కాదు.. నిర్భంధాల పాలన. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలి.
-మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్