హనుమకొండ, జూన్ 30 : కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం..ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కాల్సిన విభజన చట్ట హామీల సాధనకై కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, నిర్మాణ పనుల్లో వేగం పెరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చేలా పార్టీ పరంగా పోరాడాలని దాస్యం వినయ్ భాస్కర్ ఎంపీని కోరారు.
ఉమ్మడి ఓరుగల్లు ప్రజల 40 ఏళ్ల కలను సహకారం చేసేందుకు కృషి చేద్దామన్నారు. స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేద్దామని తెలిపారు. కేంద్రీయ విద్యాసంస్థలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొల్పేలా బీజేపీ ప్రభుత్వంపై పోరాడుదామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయమై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణకు సైతం సిద్ధమవుదామని చర్చించారు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎంపీ లాండ్స్ నిధులు కేటాయించాలని ఈ సందర్బంగా ఎంపీని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.