బచ్చన్నపేట, జూలై 8 : ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళల ఎదుగుదలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏపీఎం నాగేశ్వరరావు, మహిళ సంఘాల అధ్యక్షురాలు పచ్చిమడ్ల స్వప్న అధ్యక్షతన మహిళా శక్తి సంబురాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ వరకు మండలంలోని పలు గ్రామాలలోను ఇందిరా మహిళా శక్తి సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, మహిళా సంఘాల సభ్యుల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
9న గ్రామ సమాఖ్య సభ్యులతో సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సంఘంలో ఉన్న సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాద బీమా, రుణ బీమా వర్తింప జేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపులు నిర్వాహణ, చేపల పెంపకం, పెరిటి కోళ్ల పెంపకం, పాల డైరీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ , మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో ఈ ఏడాది మహిళా శక్తి ద్వారా నిధులు రూ. 2,18,96000 రూపాయలతో మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామానుజాచారి, ఎంపీడీవో మల్లికార్జున్, ఏపీఎం నాగేశ్వరరావు, ఏపీఓ కృష్ణ , సీసీలు నరసింలు, విజయలక్ష్మి, సత్యనారాయణ, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.