జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓపెన్‌కాస్ట్ (ఓసీ) గని కారణంగా తాడిచెర్ల వాసులు భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఒకపక్క బాంబు పేలుళ్లతో ఇండ్లు ధ్వంసమవుతుండగా, మరోవైపు బొగ్గు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. బొగ్గు నిక్షేపాల వెలికితీత కోసం విలువైన భూములు వదులుకున్న తమను జెన్కో సంస్థ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేంజర్ జోన్ పరిధిలోని తమకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించే చర్యలు ఇప్పటికీ చేపట్టడంలేదని మండిపడుతున్నారు.
ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు భూములు తీసుకున్న సంస్థ 1,400 పై చిలుకు ఇండ్ల (359.23 ఎకరాలు)ను సేకరించేందుకు 2022 డిసెంబర్ 14న నోటిఫికేషన్ ఇవ్వగా డిక్లరేషన్ ప్రకటించలేదు. దీంతో 2024 డిసెంబర్లో ఆ నోటిఫికేషన్ రద్దు కావడంతో పునరావాసం కోసం ఆశగా ఎదుచూస్తున్న ప్రజల పరిస్థితి మొదటికొచ్చింది. ఎలాగూ వేరే ప్రాంతానికి తరలివెళ్తామనే ధీమాతో బీటలువారి, కూలిపోయిన ఇండ్లలో, శ్వాసకోశ వ్యాధులతో అష్టకష్టాలు పడుతూ బతుకీడుస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఇండ్ల సేకరణ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారో.. ఎప్పుడు పూర్తిచేస్తారోనని ఆవేదన చెందుతున్నారు.
బంగారం లాంటి భూములు ధారాదత్తం చేసినందుకు తమకు దక్కే ప్రతిఫలం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా తాడిచెర్ల ఓసీపీని సందర్శించిన సందర్భంగా డేంజర్ జోన్ ఇళ్ల సమస్య పరిష్కరిస్తామన్న హామీ నెరవేరకపోవడంతో అవే బ్లాస్టింగ్లు, అదే కాలుష్యం మధ్య ఇండ్లు ఖాళీ చేయలేక తమ బతుకులు ఛిద్రం చేసుకుంటున్నారు. ఏపీ జెన్కో ఇండ్ల సేకరణ చేపట్టే సమయానికి 1,080 గృహాలుండగా, టీఎస్ జెన్కో డెంజర్ జోన్ ఏర్పాటు చేయడంతో పరిహారం కోసం పలువురు స్థానికేతరులు ఇండ్లు నిర్మించుకున్నారని ఆరోపిస్తున్నారు.
దీనివల్లే అసలైన తమకు పరిహారం, పునరావాసం దక్కడంలో జాప్యం జరుగుతున్నదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పలుమార్లు జెన్కో సంస్థ సీఎండీని పలుమార్లు కలిసి తాడిచెర్ల భూ నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కోరారని, ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో తమ బతుకులు ప్రశ్నార్థకమయ్యాయంటున్నారు. ఇప్పటికైనా మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ చొరవ తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
పచ్చని పల్లె ఛిద్రమవుతున్నది.. నిత్యం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నది. బొగ్గు తవ్వకాల కోసం జెన్కో సంస్థకు భూములిచ్చినందుకు భయాందోళనలకు గురిచేస్తున్నది. ఒకవైపు ధ్వంసమవుతున్న ఇండ్లు.. మరోవైపు కాలుష్యంతో చుట్టుముడుతున్న రోగాలతో ఆ పల్లె కన్నీరు పెడుతున్నది. బంగారం లాంటి భూములిస్తే అటు పరిహారం.. ఇటు పునరావాసం దక్కక విలవిలలాడుతున్నది. ఇది మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామస్తుల కథ. జెన్కో ఏర్పాటు చేసిన డేంజర్ జోన్ పరిధిలోని ఇండ్లు సేకరించని కారణంగా వారు పడుతున్న వ్యథ. పట్టించుకోవాల్సిన సంస్థే బాధితుల గోడును పెడచెవిన పెడుతున్నది. కోర్టు మెట్లు ఎక్కినా ప్రతిఫలం లేకుండా పోతున్నది. చివరకు జెన్కో సీఎండీ ఇచ్చిన హామీ సైతం కార్యరూపం దాల్చకుండాపోయింది.
– మల్హర్, జూన్ 25