తొర్రూరు, జూన్ 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది. పల్లెబాట, సీసీ రోడ్ల శంకుస్థాపనకు వారు శుక్రవారం గ్రామానికి రాగా గ్రామంలో 21 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే ఒక్క దళితుడికీ ఇల్లు కేటాయించకపోవడంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటారు? అత్తాకోడళ్ల మాయమాటలు కట్టిపెట్టండి’ అని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డి పోలీసుల భద్రత నడుమ హుటాహుటిన కారెక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఫతేపురం గ్రామంలో సుమారు 600 దళిత గడపలు ఉన్నా ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం అవమానకరం అన్నారు. ఇళ్ల కేటాయింపులో జరిగిన వివక్షను తీవ్రంగా పరిగణిస్తామని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.