‘మా కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయండి.. లక్షకు లక్ష పొందండి.., మా వస్తువులు కొనండి.. ఫ్రీ గిఫ్ట్‌లు, డిస్కౌంట్లు ఇస్తాం’.., అంటూ సెల్ఫోన్లకు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేశారో.. అంతేసంగతులు.. ఇంకేముంది మీ బ్యాంక్ ఖాతాను మొత్తం ఊడ్చేసేదాకా వదలరు. అంతేగాక నిత్యం మనం వాడే ఫోన్‌పే యాప్ కూడా నకిలీవి పుట్టుకురావడంతో వాటితోనూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
అదీ గాక ఈ మధ్య మేము సీబీఐ, కస్టమ్స్ అధికారులంటూ వాట్సాప్ వీడియో కాల్స్ చేసి మరీ జనాన్ని భయపెడుతూ అందినకాడికి దోచుకునేందుకూ సైబర్ నేరగాళ్లు వెనకాడడం లేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ‘స్మార్ట్’గా లేకపోతే సైబర్ నేరగాళ్ల ఎరకు చిక్కినట్టే. లేకపోతే చేజేతులా మోసపోవాల్సి వస్తుంది. నిరక్షరాస్యులు, అమాయకులే కాదు.. ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులూ వీరి వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు పెరిగిపోయాయి. అత్యాశకుపోయి చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని తలలు పట్టుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట కొత్త రకం మోసాలు వెలుగు చూస్తుండగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లోనే 136 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మార్చివేసింది. ఇప్పుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు ప్రపంచమే మన కళ్లముందు ఉండేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. అయితే, దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో మోసాలూ ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే సైబర్‌నేరగాళ్లు నిలువునా దోచేస్తారు. టెక్నాలజీ అప్డేట్ అవుతున్నకొద్దీ సైబర్ నేరస్తులు కూడా కొత్త రకం మోసాలు చేయడానికి ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఉన్నత విద్యావంతుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు అత్యాశకు పోయి సైబర్ నేరస్తుల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకొని తలలు పట్టుకుంటున్నారు.
ఫోన్లకు లింకులు పంపించడం, ప్రకటనలు, బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పడం, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు(మనీ ఇన్వెస్ట్మెంట్), వస్తువుల కొనుగోళ్లపై డిస్కౌంట్ ఆఫర్స్, జాబ్ అవకాశం కల్పిస్తామంటూ రకరకాల యాప్‌లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్ వేదికగా ఎరవేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా, సీబీఐ ఆఫీసర్లమంటూ డిజిటల్ అరెస్ట్ ద్వారా డబ్బులు లాగుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 10 నుంచి 15 సైబర్ క్రైం కేసులు నమోదవుతున్నాయి. సైబర్ నేరస్తుల వలలో పడి బాధితులు రూ.లక్షలు పొగొట్టుకొని ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, వాట్సాప్ లింకులు, ఓటీపీ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దంటూ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, కొందరు అత్యాశకు పోయి డబ్బులు పొగొట్టుకుంటున్నారు.
సైబర్ మోసాలను అదునుగా తీసుకొని కొందరు పరిచయం ఉన్న అమ్మాయిల వాట్సాప్ డీపీ, ఫేస్బుక్ ఫొటోలు మార్పింగ్ చేసి న్యూడ్ ఫొటోస్‌తో బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు ఇటీవల కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసింది. హనుమకొండలో ఓ యువతి వాట్సాప్ డీపీని బాగా పరిచయమున్న వ్యక్తి టెలిగ్రామ్ డీపీగా పెట్టి, ఆ అమ్మాయి లవ్ చేసినట్లు అబ్బాయిలతో చాట్ చేసి డబ్బులు లాగాడు. మరో యువకుడు తెలిసిన అమ్మాయి ఫేస్బుక్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి రొమాంటిక్ పిక్స్‌తో సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా సైబర్ నేరస్తుల బారిన పడి మోసపోయిన బాధితులు న్యాయం కోసం పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువగా మోసపోయిన బాధితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ స్టేషన్లో 136 కేసులు నమోదయ్యాయి. 11 కేసుల్లో రూ.16 లక్షలు కోర్టు ద్వారా బాధితులకు డబ్బులు ఇప్పించారు.
హనుమకొండకు చెందిన ఓ ప్రొఫెసర్ తన సెల్‌ఫోన్ వాట్సాప్‌కు వచ్చిన యాడ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చూశాడు. అతడికి సైబర్ నేరస్తుడు తొలుత ఫ్రీ టాస్క్ అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసి కొంత డబ్బు పంపి నమ్మించాడు. ఇక పెయిడ్ టాస్క్ చేయండి.. రూ.25 వేలు పెట్టుబడి పెడితే రూ.50వేలు వస్తాయి. రూ.లక్ష పెడితే రూ.రెండు లక్షలని నమ్మించాడు. సదరు ప్రొఫెసర్ ఏకంగా రూ.54,43,000 పెట్టుబడి పెట్టాడు. ఇంకేముంది.. నంబర్ బాక్ల్ చేసి డబ్బులు డ్రాచేశాడు. మోసపోయానని తెలుసుకున్న ప్రొఫెసర్ వరంగల్ పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు.
హనుమకొండ జూలైవాడకు చెందిన భార్యభర్తలు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇటీవల వీకెండ్‌కు ఇంటికి వచ్చారు. వివాహిత ఫోన్ వాట్సాప్‌కు లింకు వచ్చింది. మనీ ఇన్వెస్మెంట్లో ముందు రూ.లక్ష పెట్టుబడి పెట్టింది. రూ.2లక్షలు వచ్చినట్లు సైబర్ నేరస్తుడు అకౌంట్లో చూపించాడు. ఇలా గంటలో రూ.12 లక్షలు వరకు పెట్టుబడి పెట్టింది. సైబర్ నేరస్తుడు ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసి డబ్బులు డ్రా చేశాడు.
మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో హనుమకొండ హంటర్‌రోడ్డుకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటన చూసి షేర్ మార్కెట్ పేరుతో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయింది.
హనుమకొండ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆన్లైన్లో ఏపీ కొల్లూరుకు చెందిన యువతి కనెక్ట్ అయింది. అమ్మాయి అందంగా కనిపించడంతో ఇష్టపడ్డాడు. పెళ్లి చూపుల కోసం ఇద్దరు హనుమకొండలో నెల క్రితం కలుసుకుందామని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా డాడీ రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు. ఇబ్బందుల్లో ఉన్నాం. పెళ్లి చూపులకు వరంగల్ రావాలంటే నాకు గోల్డ్ కావాలి. గోల్డ్ లేకుంటే మీ ఫ్యామిలి ఇష్టపడరు. నాకు రూ.రెండున్నర లక్షలు ఇవ్వు.. పెళ్లిసమయంలో ఇచ్చేస్తానని యువతి నమ్మించడంతో అతడు డబ్బులను ఆమె అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. వెంటనే ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హనుమకొండ రాంనగర్‌కు చెందిన ఓ యువకుడి ఫోన్ వాట్సాప్‌కు సైబర్ నేరస్తుడు ఫ్రీగిఫ్ట్ లింకు పంపించాడు. ఆ యువకుడు తన వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్‌తో సహా లింకులో అప్లోడ్ చేశాడు. కానీ, ఆన్ సక్సెస్ అని అతడికి మెసేజ్ వచ్చింది. వెంటనే సైబర్ నేరస్తుడు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షల 8వేలు డ్రా చేశాడు.
వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరస్తుడు ఫోన్ చేసి.., కస్టమ్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో నమ్మి బ్యాంకు ఖాతా, ఫాన్, ఆధార్ కార్డు వివరాలు చెప్పాడు. వెంటనే అతడి ఖాతా నుంచి రూ.8 లక్షలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో అతడు వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ నేరస్తుడి అకౌంట్‌ను బ్లాక్ చేసి రూ.5 లక్షలు డ్రా చేయకుండా ఆపేశారు. కోర్డు ద్వారా బాధితుడికి ఇప్పించాడు. ఈ మోసం రెండు నెలల క్రితం జరిగింది.
కేసముద్రం మండల కేంద్రంలోని టైర్లషాపులో ఓ వ్యక్తి రూ.3800లకు రెండు టైర్లు కొన్నాడు. ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్లు యజమానికి సెల్ఫోన్లో స్క్రీన్ చూపించి టైర్లు తీసుకొని వెళ్లిపోయాడు. తీరా షాపు యజమాని ఫోన్ పేలో పరిశీలించగా ఖాతాలో డబ్బులు జమకాలేదు. తాను మోసపోయానని యజమాని వాపోయాడు.
హనుమకొండకు చెందిన ఓ సీనియర్ సిటిజన్‌కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. తాను ముంబాయి నుంచి సీబీఐ ఆఫీసర్‌ను మాట్లాడుతున్న.. మీపై సీబీఐ కేసు రిజిస్టర్ అయింది. మీ వివరాలు చెప్పండి.. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మాకు కావాల్సినంత డబ్బులు ఇవ్వండి.. లేదా మా వాళ్లు మీ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడి తీసుకొస్తారని వీడియోకాల్‌లో బెదిరించాడు. దీంతో అతడు భయపడి రూ.50వేలు సైబర్ నేరస్తుడు నంబర్ పంపిన యూపీఏ నంబర్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు.
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడకం అనేది తప్పనిసరి కావడంతో ప్రతి ఒక్కరూ సైబర్ నేరస్తులపై జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో వచ్చే అనవసరమైన లింకులు, ప్రకటనలను ఓపెన్ చేయొద్దు. వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్ గంటలో సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 1930 లేదా, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
అలా చేస్తే సైబర్ నేరస్తుడు డబ్బులు డ్రా చేయకుండా అకౌంట్‌ను బ్లాక్ చేయొచ్చు. కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసిన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 136 ఫిర్యాదులు అందాయి. 11 కేసుల్లో రూ.16లక్షలు బాధితులకు కోర్టు ద్వారా ఇప్పించాం. రాజస్తాన్‌కు చెందిన 12 మందిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. సైబర్ నేరస్తుల్లో ఎక్కువగా ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు. కొందరు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
– కే విజయ్‌కుమార్, సైబర్ క్రైం ఏసీపీ, వరంగల్ పోలీసు కమిషనరేట్