జనగామ చౌరస్తా, మార్చి 27 : జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి సీటీ స్కాన్ మిషన్ చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ నెల 24న జీరో అవర్లో జిల్లా దవాఖానలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని ఎమ్మెల్యే పల్లా ప్రశ్నించారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వెంటనే సుమారు రూ. కోటి విలువైన సీటీ స్కాన్ మిషన్ను మంగళవారం రాత్రి ఆస్పత్రికి పంపించింది.
ఇది వరకు సేవలందించిన సీటీ స్కాన్ మిషన్ మరమ్మతుకు గురవడంతో కొన్నేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందిని గుర్తించిన పల్లా తాను శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశం నుంచి పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు వైద్యారోగ్యశాఖ అధికారులు, కలెక్టర్కు లేఖలు రాశారు. కాగా, పాత మిషన్ను తొలగించే పనిలో ప్రస్తుతం నిపుణులుండగా, మరో పది, పదిహేను రోజుల్లో కొత్త సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.